హోదా ఇష్యూతో వైసీపీ రచ్చ.... ఎదురుదాడితో కౌంటరిచ్చిన ప్రభుత్వం

ప్రత్యేక హోదా అంశంపై మరోసారి ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. హోదా ఇష్యూతో అధికారపక్షాన్ని ఇరుకునపెట్టాలనుకున్న ప్రతిపక్షం రచ్చరచ్చ చేసింది. వాయిదా తీర్మానమిచ్చి చర్చకు పట్టుబట్టిన వైసీపీ.... వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలతో హోరెత్తించింది. ఇటు అధికారపక్షం కూడా ఎదురుదాడికి దిగడంతో అసెంబ్లీ అట్టుడుకిపోయింది. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చకు అనుమతిస్తామని స్పీకర్‌ చెప్పినా వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దాంతో సభ ప్రారంభమైన పది నిమిషాలకే వాయిదాపడింది.

 

సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వైసీపీ ఆందోళన కొనసాగించింది. అయితే ప్రత్యేక హోదా ముగిసిన అంశమన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌‌రాజు.... దీనిపై ఇంకా చర్చ ఎందుకన్నారు.వైసీపీ సభ్యులకు ప్రత్యేక వ్యాధి ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఎద్దేవా చేస్తే, రాష్ట్రంలో సమస్యలు లేనందునే ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని, సభను అడ్డుకోవడమే అజెండాగా పెట్టుకున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, గోరంట్ల విమర్శించారు. వైసీపీ ఆందోళనతో మూడు గంటలకు పైగా సభా సమయం వృథా అయ్యిందని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు... ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేశారు.

 

అయితే కేసుల మాఫీ కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని వైసీపీ ఆరోపించింది. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక హోదా తీర్మానం చేసిన చంద్రబాబు.... ఇప్పుడెందుకు తీర్మానం ప్రవేశపెట్టడానికి వెనుకాడుతున్నారని ప్రశ్నించారు.