ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామనుకుని డిఫెన్స్‌లో పడ్డ వైసీపీ

ఆరోపణలు ప్రత్యారోపణలతో ఏపీ అసెంబ్లీ వేడెక్కింది. అగ్రిగోల్డ్‌ ఇష్యూతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తే, ఊహించని విధంగా అధికార పార్టీ ఎదురుదాడికి దిగింది. దాంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో సభ రణరంగాన్ని తలపించింది. ముందుగా అగ్రిగోల్డ్ వ్యవహారంపై సభలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.... అధిక వడ్డీ ఆశచూపి లక్షలాది మందిని మోసం చేసిందన్నారు. చంద్రబాబు ప్రకటనపై స్పందించిన జగన్‌.... ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై జుడీషియల్‌ విచారణ జరిపించాలని సవాల్‌ విసిరారు. అయితే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు....ఆయన భార్య పేరిట అగ్రిగోల్డ్ భూములను కొన్నారని జగన్‌ ఆరోపించడంతో సభలో రగడ మొదలైంది.

 

అగ్రిగోల్డ్ భూములను తాను కొన్నట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్‌ చేశారు. నిరూపించలేకపోతే జగన్‌ రాజకీయ సన్యాసం చేయాలన్నారు..పుల్లారావు సవాల్‌తో అధికారపక్షం.... జగన్‌పై మూకుమ్మడి దాడికి దిగింది. జగన్‌కు దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు కూడా... ప్రత్తిపాటి సవాల్‌ను స్వీకరించాలంటూ జగన్‌ను టార్గెట్ చేశారు. అదే సమయంలో మంత్రి ప్రత్తిపాటి అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొన్నారన్న జగన్ ఆరోపణలపై న్యాయ విచారణకు సిద్ధమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎవరిది తప్పని తేలితే వారిని సభ నుంచి వెలివేద్దామంటూ సంచలన ప్రకటన చేశారు.

 

మంత్రిపై చేసిన ఆరోపణల విషయంలో సవాల్‌ను స్వీకరిస్తున్నారో తిరస్కరిస్తున్నారో ఏదో ఒకటి స్పష్టంచేయాలని జగన్‌‌ను స్పీకర్‌ కోరారు. అయితే అధికార పక్షం ఎదురుదాడితో డిఫెన్స్‌లో పడ్డ వైసీపీ.... సభ నుంచి వాకౌట్‌ చేసింది. దాంతో తమ సవాళ్లకు భయపడి ప్రతిపక్షం పారిపోయిందంటూ అధికార పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. అయితే అగ్రిగోల్డ్‌ వ్యవహారంలోనే కాదు, స్పీకర్‌ వ్యాఖ్యలను సైతం వక్రీకరించారంటూ ఆరోపించిన బాబు....  సభలో వీడియోలను ప్రదర్శించి వైసీపీకి కౌంటర్‌ ఇఛ్చారు.