వైసీపీ ఎమ్మెల్యేల దూకుడుకి కళ్లెం వేసేందుకు టీడీపీ కొత్త ఎత్తు

అమరావతిలో జరుగుతోన్న తొలి సమావేశాలే హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. బడ్జెట్ సెషన్స్‌ సందర్భంగా అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పదేపదే స్పీకర్‌ పోడియాన్ని ముట్టడిస్తున్న విపక్ష వైఖరితో అధికారపక్షం విసుగెత్తిపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న సమయంలోనూ, ప్రతిపక్ష నేత అడ్డుతగలటం, వైసీపీ  ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంటరీ చేయటం, అందుకు ప్రతిగా అధికార పార్టీ కౌంటర్‌ ఇస్తుండటంతో సభా వ్యవహారాలు గందరగోళంగా మారాయి. దాంతో ప్రతిపక్షం దూకుడుకి కళ్లెం వేయడానికి ప్రభుత్వం కొత్త ఎత్తు వేసింది. సభాధ్యక్షుడు మాట్లాడుతున్నపుడు అడ్డు తగిలితే ఆటోమేటిక్ సస్పెన్షన్ పడేలా రూల్స్‌ మార్చేందుకు వ్యూహ రచన చేసింది.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు అంతర్జాతీయ జలదినోత్సవంపై మాట్లాడుతోన్న సమయంలోనూ వైసీపీ అడుగడుగునా అడ్డుతగిలింది. సీఎం మాట్లాడుతున్నపుడు తనకు మైక్ కావాలని వైసీపీ అధినేత జగన్ అడగటం, అందుకు స్పీకర్ తిరస్కరించటంతో వైసీపీ సభ్యులు పోడియం దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రచ్చరచ్చ చేశారు. దాంతో సభావ్యవహారాలకు ప్రతిపక్షం పదేపదే అడ్డుతగులుతోందని ఆరోపించిన టీడీపీ, బీజేపీ సభ్యులు.... అసెంబ్లీలో కొత్త రూల్స్ ప్రవేశపెట్టాలని స్పీకర్‌ను కోరారు. సభా నాయకుడు మాట్లాడుతున్నపుడు అడ్డుతగులుతోన్న విపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలని కోరారు. 

 

అసెంబ్లీలో కొత్త రూల్స్ గురించి రూల్స్ కమిటీకి సిఫార్సులు చేయాలని స్పీకర్ కోడెలకు శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల విజ్జప్తి చేశారు. సభా సమయాన్ని వృథా చేస్తే దానికి సమానమైన ధనాన్ని... ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేల నుంచి వసూలు చేసే విధంగానూ, పోడియం వద్దకు వచ్చి పదేపదే అడ్డుతగిలితే ఆటోమేటిక్‌గా సస్పెన్షన్ వేటు పడేవిధంగా చూడాలని అధికార పార్టీ నేతలు చేసిన సూచనలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఒకవేళ న్యూ రూల్స్‌ను అమలు చేస్తే వైసీపీ దూకుడుకి కళ్లెంపడినట్లే.