రచ్చరచ్చ చేసిన వైసీపీ... తన జీవితంలో చూడలేదంటూ బాబు ఫైర్‌

ఏపీ అసెంబ్లీలో వైసీపీ రచ్చరచ్చ చేసింది. పదేపదే స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగింది. దాంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. అగ్రిగోల్డ్‌ ఇష్యూపై ఒకసారి, రైతు ఆత్మహత్యలపై మరోసారి శాసనసభ వాయిదాపడగా, వైసీపీ రెండుసార్లు వాకౌట్‌ చేసింది. పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఏదంటూ వైసీపీ పదేపదే స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి వైసీపీ రచ్చరచ్చ చేసింది. దాంతో వైసీపీ సభ్యుల తీరుపై ఇటు స్పీకర్‌, అటు సీఎం తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. 

 

జల సంరక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతుండగా, సీఎం ప్రసంగానికి వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించిన వైసీపీ సభ్యులు.... రైతు వ్యతిరేక విధానాలు నశించాలంటూ స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు.... సభను తప్పుదోవ పట్టించారంటూ ఆరోపించారు. దాంతో సభా నాయకుడు ఏం మాట్లాడాలో కూడా మీరే చెబుతారా అంటూ వైసీపీ సభ్యులపై స్పీకర్‌ మండిపడ్డారు.

 

వైసీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన ముఖ‌్యమంత్రి చంద్రబాబునాయుడు.... తన 40ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. అయితే జలదినోత్సవంపై ప్రకటన అంటూ చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారంటూ ప్రతిపక్షం అభ్యంతరం తెలిపింది. సభా నియమాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని, పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తినా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ వైసీపీ వాకౌట్‌ చేసింది. అనంతరం జల సంరక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు.... ఎమ్మెల్యేలతో ప్రతిజ్ఞ చేయించారు. అయితే వాకౌట్‌ చేసిన వైసీపీ సభ్యులు తిరిగి సభలోకి రావడంతో, సభ‌్యులందరి చేత సీఎం మరోసారి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సభ గురువారానికి వాయిదా పడింది.