రెయిన్‌ గన్లతో పంటలు కాపాడగలిగితే....ఇక ప్రాజెక్టులెందుకు?

రెయిన్‌ గన్లతో పంటలు కాపాడగలిగితే....ఇక ప్రాజెక్టులెందుకు? కోట్ల రూపాయల ఖర్చెందుకు అంటోంది వైసీపీ. రైతు రుణమాఫీపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ అబద్ధాల మయమేనంటూ ఆందోళనకు దిగింది. జగన్ మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేయడంతో వైసీపీ రచ్చరచ్చ చేసింది. అయితే ప్రతిపక్షం విమర్శలను ధీటుగా తిప్పికొట్టే క్రమంలో అసెంబ్లీని రెండుసార్లు వాయిదా వేసింది అధికారపక్షం. 

 

ప్రశ్నోత్తరాల్లో వైసీపీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నపై రచ్చరచ్చ జరిగింది. రాష్ట్రంలో 916మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రైతులను ఏవిధంగా ఆదుకుంటుందో చెప్పాలని పెద్దిరెడ్డి డిమాండ్‌ చేశారు. కరువు ప్రాంతాల్లో రెయిన్‌గన్ల సాయంతో పంటలు కాపాడేటట్లయితే, కోట్ల రూపాయల ఖర్చుతో ప్రాజెక్టులు కట్టడం ఎందుకని పెద్దిరెడ్ది ప్రశ్నించారు. రైతులకు లక్ష కోట్ల రుణభారం ఉంటే, ఇప్పటివరకు కేవలం 10వేల కోట్లు కూడా మాఫీ చేయలేదని పెద్దిరెడ్డి అనడంతో రగడ మొదలైంది. పెద్దిరెడ్డి ఆరోపణలపై మంత్రి పుల్లారావు ఘాటుగా జవాబిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని 5లక్షలకు పెంచామన్న ప్రత్తిపాటి..... ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా అమలు చేయడం లేదని తెలిపారు. 

 

మంత్రి మాట్లాడుతుండగా ప్రతిపక్ష నేత జగన్‌ కల్పించుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. రైతుల ఆత్మహత్యలు, ఇన్‌ఫుట్‌ సబ్సిడీపై మంత్రి తప్పుడు లెక్కలు చెబుతున్నారన్న జగన్‌, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వకపోవడం వల్లే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ ఆరోపించారు.  అయితే అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో స్పీకర్‌..... జగన్‌ మైక్‌ కట్ చేశారు. అదే సమయంలో అధికార పార్టీ సభ్యులు.... జగన్‌పై మూకుమ్మడి విమర్శల దాడి చేశారు. దాంతో వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకల్‌ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. ఎంతకీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభ మరోసారి వాయిదా పడింది.