ప్రతిపక్షం లేని అసెంబ్లీ అదిరిందిగా...

 

ఉప్పు లేని కూర ఎలా ఉంటుంది. చప్పగా... రుచిలేకుండా అసలు ఏం తింటున్నామో కూడా తెలియకుండా ఉంటుంది. మరి దీనిలాగే ఉంటుంది.. ప్రతిపక్షం లేని అసెంబ్లీ కూడా. అలా ప్రతిపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిజానికి అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటేనే అదొక కళ. అధికారపక్షాన్ని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాల్సి ఉంటుంది. ప్రజల సమస్యలపై చర్చించాలి. సమస్యలకు పరిష్కారమయ్యేలా అవసరమైతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి. అధికారపక్షానికి మాట్లాడే ఛాన్స్‌ ఇవ్వకుండా, అసలు సభ జరిగేందుకు వీలుగా లేకుండా చేయాలి. ఇదీ అసెంబ్లీలో ప్రతిపక్షం చేయాల్సిన పని. కానీ ఏపీ అసెంబ్లీలో సీన్ రివర్స్ లో ఉంది. ఏంటో చెరువు మీద నక్క అలిగినట్టు... ప్రతిపక్షం అయిన జగన్ అండ్ కో బ్యాచ్ అసెంబ్లీ మీద అలిగి సమావేశాలకు డుమ్మా కొట్టారు. పాపం నష్టం వారికే అని తెలియట్లేదు. పైకి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తామని ఏదో కుంటిసాకు చెబుతున్నారు కానీ... పాదయాత్ర చేసుకోవడానికి అది జగన్ వేసిన ప్లాన్ అని అందరికీ తెలుసనుకోండి.

 

అయితే విచిత్రం ఏంటంటే.. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా బాగానే ఉంటుందేమే అనిపిస్తుంది ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే. ఎందుకంటే... ఇంతకుముందు ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా.. వైసీపీ నేతలు చేసే గోలకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా.. అంతా గందరగోళంగా ఉండేది. గత అసెంబ్లీ సమావేశాలు అయితే అసలు ఎందుకు జరిగాయో కూడా తెలియదు. ఆ సమావేశాల వల్ల ఒక్క శాతం ఉపయోగం లేకుండా పోయింది. కానీ ఈసారి అసెంబ్లీ సమావేశాలు మాత్రం కాస్త భిన్నంగా ఉండబోతున్నాయి అని అర్ధమయింది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రశాంతంగా జరిగాయి. పట్టిసీమపైనా, నదుల అనుసంధానంపైనా చర్చలు జరగగా... ప్రతిపక్షం లేకపోవడంతో ఎక్కడా అసెంబ్లీకి ఆటంకం కలగలేదు.  ప్రభుత్వం చెప్పాలనుకున్నది చెప్పింది. దాంతో ఆ సమాచారమంతా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చేరింది. దీంతో గడచిన మూడేళ్ళతో పోల్చుకుంటే ఈసారి అసెంబ్లీ సమావేశాలే ఆసక్తికరంగా సాగుతున్నట్లు భావించాల్సి ఉంటుంది.

 

ఇక ప్రతిపక్షం లేకపోవడం చంద్రబాబుకు కలిసొచ్చింది. తాము చేసిన అభివృద్ధిని గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంచి అవకాశం దొరికింది. దీంతో ఆయన ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం దక్కింది. అలాగే ప్రస్తుతం ఉన్న సమస్యలపై ప్రశ్నించే అవకాశాన్ని ప్రతిపక్షం కోల్పోయింది. మరి ప్రతిపక్షం ఇప్పటికైనా కళ్లు తెరిచి తాము చేసిన తప్పేంటో తెలుసుకొని అసెంబ్లీకి వస్తే బావుంటుంది. అలా కాని పక్షంలో తమ తప్పుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది.