ఆదర్శప్రాయంగా నిలుస్తున్న ఆంద్ర, తెలంగాణా స్పీకర్లు

 

గత రెండు నెలలుగా ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య వివిధ వ్యవహారాలలో ఏర్పడిన ఘర్షణ వైఖరి కారణంగా నిత్యం కోర్టుల, కేంద్రం జోక్యం అనివార్యమవుతోంది. ఈ పరిస్థితులు చూసి ఎప్పటికయినా వీటి మధ్య సయోధ్య అనేది ఏర్పడుతుందా? ఎప్పటికయినా సమస్యలు పరిష్కారం అవుతాయా?అనే అనుమానాలు ఇరు ప్రాంత ప్రజలలో కలుగుతున్నాయి. త్వరలో ఆగస్ట్ 15 జెండా పండుగ, ఆ తరువాత రెండు రాష్ట్ర శాసనసభా సమావేశాలు నిర్వహించవలసి ఉండటంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల నడుమ మళ్ళీ కొత్తగా ఏమి సమస్యలు ఉత్పన్నం అవుతాయో అని అందరూ కంగారు పడ్డారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఇరు రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసనసభా వ్యవహారాల మంత్రులు చాలా సయోధ్యతో సమస్యను పరిష్కరించుకొని అందరి మన్ననలు అందుకొంటున్నారు.

 

ఆంద్రప్రదేశ్ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, తెలంగాణ స్పీకర్ మదుసూదనాచారి, మంత్రులు యనమల రామకృష్ణుడు, హరీష్ రావు, ఇరు రాష్ట్రాల శాసనసభ అధికారులు సమావేశమై ప్రోటో కాల్ విధానాల ప్రకారం ఎవరికీ ఇబ్బంది, గౌరవానికి భంగం కలగని విధంగా భవనాలు, చాంబర్లు కేటాయించుకోవాలని నిర్ణయించుకొన్నారు. అదే విధంగా ఇరు రాష్ట్ర శాసనసభ్యులు, మంత్రుల మధ్య ఘర్షణ వాతావరణం నివారించేందుకు, శాసనసభ సమావేశ తేదీలను నిర్ణయించుకొనేందుకు ఇరు రాష్ట్రాల మంత్రులు, స్పీకర్లు అంగీకరించారు. ఇక జెండా వందనం కార్యక్రమం నిర్వహించే విషయంలో కూడా ఇరు రాష్ట్రాల ప్రతినిధులు పట్టు విడుపులు ప్రదర్శించడం చాలా హర్షణీయం. ఆంద్ర శాసన స్పీకర్ శాసనసభ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రంగా వద్ద, తెలంగాణా స్పీకర్ శాసనసభ భవనంపై జెండా ఎగురవేసేందుకు అంగీకరించారు.

 

రెండు ప్రభుత్వాలు ఇక ముందు కూడా ఇటువంటి విజ్ఞత, సయోధ్యే ప్రదర్శిస్తూ చర్చల ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకొంటూ ముందుకు సాగినట్లయితే, ఇక కేంద్రం మధ్యవర్తిత్వం అవసరం ఉండదు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య మళ్ళీ సహృద్భావా వాతావరణం ఏర్పడితే, రెండూ కూడా వేగంగా అభివృద్ది సాధించగలవు. అలా కాక నిత్యం ఒకదానితో మరొకటి ఘర్షించుకొంటున్నట్లయితే, ప్రజల మధ్య దూరం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కేంద్రం, కోర్టుల ముందు ప్రభుత్వాలు, తెలుగు ప్రజలు చులకనవుతూనే ఉంటారు.