ఆశయం మహోన్నతం... ఆచరణ అమానుషం!

మళ్లీ తుపాకులు మోగాయి... మళ్లీ ప్రాణాలు పోయాయి... ఈసారి 28జీవితాలు ఆహుతయ్యాయి! 28కుటుంబాలు అల్లకల్లోలమైపోయాయి! ఒక్కటే తేడా... చనిపోయిన వారు మావోయిస్టులు. ఒక్కసారి చరిత్రలోకి చూస్తే , ఇదే విధంగా, కొన్ని సార్లు పోలీసులు, గ్రేహౌండ్స్ కూడా బలయ్యారు. నష్టం ఏ వైపున జరిగినా చనిపోయేది మాత్రం మనుషులే! సాటి భారతీయులే! అసలు ఏంటి ఈ యుద్ధం? మనతో మనమే చేసుకుంటున్నాం. మనల్ని మనమే చంపుకుంటున్నాం. ఎందుకు? 

 

మన జవాన్లను ఉరిలో పాక్ ఉగ్రవాదులు చంపారు. మళ్లీ మన వారు సర్జికల్ స్ట్రైక్స్ చేసి పాకిస్తాన్ వాళ్లను హతమార్చారు. ఇందులో ఎలాంటి కన్ ఫ్యూజన్ లేదు. ఎందుకంటే, పాకిస్తాన్ శత్రుదేశం. దానికి మన కాశ్మీర్ మీద కన్నుంది. అందుకే, మన ఆత్మ రక్షణ కోసం హింస చేయాల్సి వస్తోంది. ఆ క్రమంలో మన వారు బలవుతున్నారు. పాకీలు కూడా హతమవుతున్నారు. కాని, మావోయిస్టు హింస ఇంత సింపుల్ గా అర్థమయ్యేది కాదు... 

 

మావోయిస్టులు శత్రు దేశం వారు కాదు. వాళ్లు మనలాంటి భారతీయులే. అయినా వాళ్లని ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలే నిర్ధాక్షిణ్యంగా పోలీసుల చేత ఎన్ కౌంటర్ చేయిస్తున్నాయి! ఎందుకని? మనతో మనమే యుద్ధం చేసుకోవాల్సిన అగత్యం ఏంటి? దీనికి సమాధానం గన్ను పట్టిన అన్నలే ఇవ్వాలి... 

 

కార్ల్ మార్క్స్ బోధనలతో విప్లవం రావాలనుకుంటుంది కమ్యూనిజం. ఆ కమ్యూనిజానికి హింసాత్మక మార్గాన్ని సూచిస్తుంది మావోయిజం. మావో జడాంగ్ చైనాలో పాటించిన హింసాత్మక తిరుగుబాటు పద్ధతి ఇక్కడ కూడా అమలు చేయాలనుకుంటున్న వాళ్లే మావోయిస్ట్ పార్టీ నేతలు, సైనికులు! మావోల ప్రధాన శత్రువు భారతదేశ ప్రభుత్వం. ప్రజలు ప్రతీ అయిదేళ్లకోసారి ఎన్నుకుంటున్న ప్రభుత్వాలు పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మలని, పేదల్ని, అణగారిన వర్గాల్ని పట్టించుకోలేదని వారి ఆరోపణ. అది నిజం కూడా. కాని, అసలు సమస్య వారు ఎంచుకున్న పద్ధతిలోనే వుంది! సరైన సమస్య కోసం తప్పుడు సమాధానం మావోయిస్టులు ఆశ్రయించారు...

 

భారతదేశంలో నిజంగానే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు దోపిడీకి గురవుతున్నారు. అగ్రవర్ణాల్లోని పేదల పరిస్థితి కూడా దారుణంగానే వుంది. ఇక మైనార్టీల సంగతి సరేసరి. అయినా కూడా జనం పెద్ద ఎత్తున ఎన్నికల వేళ ఓట్లు వేసి ఏదో ఒక పార్టీకో, కూటమికో అధికారం కట్టబెడుతున్నారు. అంటే అత్యధిక శాతం మంది ఇప్పుడున్న వ్యవస్థతో సంతృప్తిగానే వున్నారని అర్థం. కాని, మరింత ఉన్నతమైన జీవన ప్రమాణాల్ని కోరుకుంటున్నారు. ఈ విషయం సరిగ్గా అర్థం చేసుకోని నక్సలైట్లు జనం సంపూర్ణ మద్దతు ఇవ్వని సాయుధ విప్లవానికి మొగ్గు చూపుతున్నారు. ఇక్కడే అన్నలు అడవికి పరిమితం అవ్వాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. వాళ్లు ఎంత వరకూ గన్నులు వదలరో అంత వరకూ  మెజార్టీ భారతీయులకి తమ వాదన వినిపించుకునే వీలుండదు. ఎంత వరకూ జనంలో మద్దతు రాదో అంత వరకూ ఎన్ కౌంటర్లు జరుగుతూనే వుంటాయి. అమూల్యమైన విప్లవ వీరుల ప్రాణాలు పోయాక ఎన్ కౌంటర్ బూటకమని ఎంత ప్రకటించినా ఏం లాభం? ఎవరు పట్టించుకుంటారు? 

 

లక్షల మంది సైన్యం, పోలీసులతో, లక్షల కోట్ల బడ్జెట్ తో నడిచే ప్రభుత్వాలు ఎక్కడా... కొన్ని వేల మంది తిండీ, నీరు, నిద్రా లేని విప్లవ వీరులు ఎక్కడా? మావోయిస్టు పార్టీ ఎప్పటికప్పుడు తనకున్న ఈ అల్పమైన బలంతోనే విజయం సాధిస్తానని అనుకోవటం ప్రమాదకరమైన భ్రమ. ఇవాళ్ల కాకపోతే రేపు ప్రజలు ఎన్నుకున్న భారత ప్రభుత్వానిదే పై చేయి అవుతుంది. దానికున్న నైతిక, ఆర్దిక, మానవ బలం అలాంటిది. ఈ విషయాన్ని గుర్తించి మావో అగ్రనేతలు సాధ్యమైనంత త్వరగా ప్రధాన స్రవంతిలోకి రావాలి. ఎన్నికల ద్వారా ప్రజల మద్దతు పొంది తమ ఆలోచనలు అమల్లో పెట్టాలి. అంతే కాని, మంటల్లో దూకే మిణుగురు పురుగుల్లా అనవసరంగా అమాయకుల్ని బలి చేసుకోవద్దు! ఆఫ్ట్రాల్... మావోలు, నక్సలైట్లు లేని కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ లాంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందటం లేదా? అక్కడ పేదలు ప్రభుత్వంపై తమదైన రీతిలో పోరాటాలు చేయటం లేదా? హింసాత్మక మార్గం మాత్రమే పరిష్కారమా? అసలు... ఇలాంటి సాయుధ పోరాటం... తమ స్వంత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ప్రపంచంలో ఎక్కడైనా విజయవంతం అయిందా? అడవిలో అన్నలే ఆలోచించుకోవాలి....