ఆ విషయంలో యువరాజావారిని శంకించడానికి లేదుట

 

ఎన్నికలకు ముందు వరకు రాహుల్ గాంధీని కాబోయే దేశప్రధానిగా కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. ఆ తల్లీ కొడుకులు ఎప్పుడు తలచుకొంటే అప్పుడు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొనే అవకాశం ఉన్నప్పటికీ, త్యాగ మూర్తుల కుటుంబానికి చెందిన వారు కనుక గత పదేళ్లుగా డా.మన్మోహన్ సింగును ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఆయన చెయ్యిపట్టుకొని వారే దేశాన్ని ఎంచక్కగా పరిపాలించారు. అయితే కాంగ్రెస్ చివరి రోజుల్లో యువరాజవారు తన కుర్చీపై మనసు పారేసుకొన్నారని అప్పటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ గ్రహించగానే, తను కుర్చీ కాళీ చేసేయడానికి సిద్దమని ఆయన ప్రకటించడమే కాకుండా, రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేసేందుకు కూడా తను సిద్దమని ప్రకటించారు. తీరాచేసి యువరాజవారు పట్టాభిషేకానికి అంగీకరించి దేశప్రజలను, కాంగ్రెస్ నేతలను ఉద్దరించేందుకు దయతో అంగీకరించినా వెర్రిబాగుల ప్రజలందరూ మోడీ మాయమాటలు నమ్మి ఆయనకు హ్యాండిచ్చేసారు. ఆయన కోసం మన్మోహనుల వారు ఖాళీ చేసిన కుర్చీలో మోడీ వచ్చి చటుకున్న కూర్చొండిపోయారు.

 

నిజానికి యువరాజు రాహుల్ గాంధీకి, అటు పార్టీలో, ఇటు దేశ ప్రజలలో కూడా తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొంటున్న నరేంద్ర మోడీని అవలీలగా ఓడించిపడేసేవాడే. గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన ఆయనకు అదేమీ పెద్దపని కాదు. కానీ మీడియా కూడా మోడీ మాయలో పడి ఆ వెర్రిబాగుల జనాలతో కలిసి యువరాజవారికి నాయకత్వ లక్షణాలు లేవని అర్ధంపర్ధం లేని ప్రచారం చేయడంతో ఆయన ఇమేజి చాలా డ్యామేజి అయిపోవడంతోనే ఆయన కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోయారు అంతే.

 

పదేళ్ళ సోనియా కర్రపెత్తనంలో యూపీయే ప్రభుత్వం దేశాన్ని ఎక్కడికో తీసుకుపోయింది. తను ప్రధాని కుర్చీలో కూర్చోగానే ప్రజలను ఇంకా ఎక్కడికో తీసుకుపోతానని యువరాజవారు హామీ ఇచ్చారు కూడా. కానీ ప్రజలు ఆయన మాటలు నమ్మలేదు. కానీ అవే మాయమాటలు చెప్పిన మోడీని గుడ్డిగా నమ్మేసి బీజేపీకి ఓటేసేయడంతోనే, కాంగ్రెస్ పార్టీని యువరాజవారు గెలిపించలేకపోయారని అంటోనీ కమిటీ కనిపెట్టేయగలిగింది. అయినా దేశానికి స్వాత్రంత్రం వచ్చినప్పటి దాదాపు నేటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అందులో ప్రజలను ఉద్దరిస్తూనే ఉంది. కానీ అది గుర్తించని వెర్రిబాగుల జనాలు కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్లలో చేయలేనిది మోడీ ఐదేళ్ళలో చేసి చూపిస్తానంటే గుడ్డిగా నమ్మేశారని అంటోనీ కమిటీ తన నివేదికలో ఆవేదన వ్యక్తం చేసింది. చేతిలో అధికారం ఉన్నపుడే మోడీని ఓడించలేకపోయినప్పటికీ, ఐదేళ్ళ తరువాత ఆయన వెనుక ఎంతమంది మిగిలుంటారో తెలియని పరిస్థితిలో కూడా ఆయన తన నాయకత్వ పటిమను ప్రదర్శించుతూ, మోడీని చిత్తుచిత్తుగా ఓడించి పడేయడం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారం సంపాదించి తను ప్రధానమంత్రి అవడం తధ్యమని అంటోనీ మహాశయులు శలవిచ్చారు.