TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాజీ మంత్రి నారాయ‌ణ‌కు ముంద‌స్తు బెయిల్‌

Published on: Wed Sep 14, 2022 3:54PM

రాజధాని బృహత్‌ప్రణాళిక, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్‌ మంజూరైంది. ఆయనతో పాటు రామకృష్ణ హౌసింగ్‌ డైరెక్టర్‌ అంజనీకుమార్‌, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌కు కూడా హైకోర్టు ముందస్తు బెయిల్‌కు అనుమతించింది. ముందస్తు బెయిల్ కోసం నారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టు లో విచారణకు రాగా,  నారాయణ  తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.  నారాయణకు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది పోసాని కోరారు. కింద కోర్టులో కూడా మిగతా నిందితులకు సెక్షన్‌లు వర్తించవని రిమాండ్‌ను తిరస్కరించిన అంశాన్ని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ముందస్తు బెయిల్‌ కోసం మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేశ్‌, అంజనీకుమార్‌  హైకోర్టులో పిటిషన్‌ వేసుకోగా విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం గతంలో తీర్పును రిజర్వు చేసింది. అయితే తాజాగా వీరికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసులో నారాయణ కీలక నిందితుడని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఎస్సీ, ఎస్టీ కేసులో బెయిల్ ఇవ్వకూడదని వాదనలు వినిపించారు. అయితే హైకోర్టులోనే మరో కేసులో నారాయణకు ముందస్తు బెయిల్ ఇచ్చిందని న్యాయవాది పోసాని  గుర్తుచేశారు. వాదనలు విన్న హైకోర్టు మూడు నెలల పాటు నారాయణ విదేశాల్లో చికిత్స చేయించుకునేందుకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.