మొండి బ్యాక్టీరియాకు తిరుగులేని వైద్యం


బ్యాక్టీరియా కారణంగా శరీరంలోకి ఏదన్నా ఇన్ఫెక్షన్‌ చేరితే, దానిని సరిచేసేందుకు యాంటీబయాటిక్స్‌ను అందిస్తూ ఉంటారు. ఈ యాంటీ బయాటిక్స్‌ కారణంగా శరీరంలోని మంచి బ్యాక్టీరియా కూడా చనిపోవడం, మనిషి నిస్సత్తువగా మారిపోవడాన్ని తరచూ గమనిస్తూనే ఉన్నాము. పైగా తరచూ ఇలాంటి యాంటీబయాటిక్స్‌ను వాడటం వల్ల బ్యాక్టీరియా కూడా రాటుదేలే పరిస్థితులు వస్తున్నాయి. యాంటీబయాటిక్స్ కూడా పనిచేయలేని స్థితిలో ఏటా వేలమంది నిస్సహాయంగా ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఇక మీదట మొండి బ్యాక్టీరియాలను ఎదుర్కొనే చికిత్స అందుబాటులోకి రానుంది.

 

మొండితనానికి కారణం

కొన్నిరకాల బ్యాక్టీరియాల మీద రక్షణగా ఒక పొర ఏర్పడటంతో... వాటి మీద మందులు పనిచేయడం లేదని తేలింది. ఈ పొరను బయోఫిల్మ్‌ అంటారు. యాంటీబయాటిక్స్ ఈ పొరను దాటుకుని బ్యాక్టీరియాను నిర్వీర్యం చేయడంలో విఫలం అవుతుంటాయి. ఇలా యాంటీబయాటిక్స్ నుంచి నిలదొక్కుకున్న బ్యాక్టీరియా... అంతకు పదింతలై వృద్ధి చెంది ప్రాణాంతకంగా మారుతుంది.

 

విద్యత్తుతో చికిత్స

మొండి బ్యాక్టీరియాని ఛేదించేందుకు ‘వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ’కి చెందిన పరిశోధకులు విద్యుత్తుని ప్రయోగించి చూశారు. ఇందులో భాగంగా చిన్నపాటి విద్యుత్తుని రోగి శరీరంలోకి పంపారు. ఆ విద్యుత్తుతో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ అనే రసాయనం ఉత్పత్తి అయ్యేలా చూశారు. ఈ హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ మొండి బ్యాక్టీరియా మీద ఉన్న బయోఫిల్మ్‌ను ఛేదించింది. దీంతో యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా మీద దాడి చేసే అవకాశం ఏర్పడుతుంది.

 

కొత్త కాదు కానీ...

విద్యుత్తును ప్రయోగించి బ్యాక్టీరియాను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ఈనాటివి కావు. దాదాపు వందేళ్ల నుంచీ ఇలాంటి ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ అలాంటి ప్రయత్నాలేవీ సత్ఫలితాలు ఇవ్వలేదు. కానీ సరిగ్గా తగినంత మోతాదులో విద్యుత్తు అందించడం, ఆరోగ్యకరమైన కణాలు దెబ్బతినకుండా నేరుగా బ్యాక్టీరియా మీద దాడి చేయడం... వంటి అంశాలలో తాజా పరిశోధన విజయవంతమయ్యింది. పైగా ఈ చికిత్సకు బ్యాక్టీరియా కూడా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా లొంగిపోవడం కూడా పరిశోధకులకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది.

 

‘విద్యుత్తుతో బ్యాక్టీరియా నాశనం’ అనే పరిశోధన విజయవంతం కావడంతో ఈ చికిత్సకు సంబంధించి పేటెంట్లను కూడా తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చికిత్సే కనుక అందుబాటులోకి వచ్చేస్తే ఊపిరితిత్తులకు సోకే ఇన్ఫెక్షన్లు, ఎంతకీ మానని గాయాలను ఇకమీదట సులభంగా లొంగదీసుకోవచ్చు. అదే కనుక జరిగితే మున్ముందు ‘ఇచట మొండి గాయాలను మాన్పబడును’ అన్న బోర్డులు కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

 

 

- నిర్జర.