యాంటీబయాటిక్స్ ప్రాణాంతకమా!

యాంటీబయాటిక్స్ ప్రపంచానికి చేసిన మేలు అంతాఇంతా కాదు. అవే కనుక లేకపోతే చిన్నపాటి చెవిపోటు కూడా ప్రాణాంతకంగా మారిపోయే అవకాశం ఉంది. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ- యాంటీబయాటిక్స్ను విచ్చలవిడిగా వాడేస్తున్నారనే అపవాదు మొదలవుతోంది. దీని వల్ల సూక్ష్మజీవులు మొండిబారిపోవడమే కాకుండా, జీర్ణాశయంలోని ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా నాశనం అయిపోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనని సూచించే పరిశోధన ఒకటి వెలుగులోకి వచ్చింది.

 

టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తేనెటీగల మీద యాంటీబయాటిక్స్ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలనుకున్నారు. అందుకోసం విశ్వవిద్యాలయం పైన ఉన్న తేనెపట్టులలోంచి కొన్ని తేనెటీగలను ల్యాబొరేటరీలోకి తీసుకువచ్చారు. వాటిలో కొన్నింటికి సాధారణ పంచదార నీళ్లు తాగించారు. వీటికి ఆకుపచ్చ రంగు చుక్కని అంటించారు. మరికొన్నింటికి టెట్రాసైక్లిన్ అనే సాధారణ యాంటీబయాటిక్ కలిపిన నీరు తాగించారు. వీటికి గులాబీ రంగు చుక్కని అంటించారు. ఇలా చేసిన తరువాత తిరిగి ఆ తేనెటీగలన్నింటినీ కూడా వాటి పట్టు దగ్గర వదిలిపెట్టేశారు.

 

 

కొన్ని రోజుల తరువాత తేనెపట్టు దగ్గరకి వెళ్లి పరిశీలిస్తే... యాంటీబయాటిక్స్ స్వీకరించిన తేనెటీగలలో మూడోవంతు మాత్రమే బతికి ఉన్నాయి. సాధారణ పంచదార నీళ్లు తాగిన తేనెటీగలు మాత్రం ఎక్కువశాతం ఆరోగ్యంగానే ఉన్నాయి. తేనెటీగలలో యాంటీబయాటిక్స్ వాడటం వల్ల వాటి జీర్ణవ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా నాశనం అయిపోయినట్లు గ్రహించారు. ఈ కారణంగా ‘సెరాటియా’ అనే హానికారక సూక్ష్మజీవి వాటి మీద దాడి చేసే అవకాశం చిక్కింది.

 

యాంటీబయాటిక్స్ వాడకం వల్ల తేనెటీగలలో కనిపించిన ఫలితమే మనుషులకి అన్వయిస్తుందని ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. కానీ రెండు జీవులకీ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. తేనటీగలకి మల్లే మనుషుల జీర్ణాశయంలో కూడా ‘గట్ బ్యాక్టీరియా’ అనే మంచి బ్యాక్టీరియా నివసిస్తుంది. ఈ గట్ బ్యాక్టీరియా దెబ్బతిన్నప్పుడు ‘సెరాటియా’ అనే హానికారక జీవి మనిషిని కూడా నాశనం చేస్తుంది.

 

తేనెటీగల పెంపకంలో కూడా యాంటీబయాటిక్స్ వాడకం విపరీతంగా ఉంటుంది. వాటిలోని ‘foulbrood’ అనే వ్యాధిని నివారించేందుకు యాంటీబయాటిక్స్ను వాడుతుంటారు. ఈమధ్యకాలంలో తేనెపట్టులో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా మాయమైపోతుండటం వాటి పెంపకందారులు గమనించారు. దానికి కారణం ఏమిటో తెలియక తలలు పట్టుకునేవారు. కానీ యాంటీబయాటిక్స్ వాడటం వల్లే వాటి జనాభా నశించిపోతోందని ఈ పరిశోధన రుజువుచేస్తోంది. ఇక మీదట పెంపకందారులు యాంటీబయాటిక్స్ వాడకంలో కాస్త విచక్షణ చూపించాలని కోరుతున్నారు పరిశోధకులు. అంతేకాదు! మున్ముందు మనుషులు కూడా అత్యవసర పరిస్థితులలోన యాంటీబయాటిక్స్ వాడాలని సూచిస్తున్నారు. యాంటీబయాటిక్ రెండువైపులా పదును ఉన్న కత్తిలాంటి ఆయుధమని గుర్తుచేస్తున్నారు.

- నిర్జర.