అటు కొవిడ్.. ఇటు ఆంథ్రాక్స్.. వరంగల్ జిల్లాలో వణికిపోతున్న జనం
Published on: Tue Oct 26, 2021 12:08PM
కొవిడ్ మహమ్మారి తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గకుండానే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో మరో కలకలం రేగింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం, చాపలబండలో ఆంథ్రాక్స్ వెలుగు చూసింది. ఆంథ్రాక్స్ వ్యాధి లక్షణాలతో నాలుగు గొర్రెలు మృతి చెందాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన ప్రదేశానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. చనిపోయిన గొర్రెలు సాంబయ్య అనే రైతుకు చెందినవి. అధికారులు దగ్గరుండి గొర్రెలను ఖననం చేయించారు.
ఆంథ్రాక్స్ లక్షణాలతో నాలుగు గొర్రెలు చనిపోవడంతో దుగ్గొండ మండలంలో తీవ్ర భయాందోళన నెలకొంది. గొర్రెలు చనిపోయిన చాపలబండ గ్రామంలో అయితే జనాలు ఇండ్ల నుంచి బయటికి రావడానికి భయపడిపోతున్నారు. అయితే అధికారులు మాత్రం ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఆంథ్రాక్స్ లక్షణాలు కనిపిస్తున్నా..ఇంకా నిర్దారణ కాలేదని చెప్పారు. పూర్తి నివేదికలు వచ్చాకే తేలుతుందన్నారు. ఒకవేళ ఆంధ్రాక్స్ అయినా భయపడాల్సిన అవసరం లేదని, తగు జాగ్రత్తలతో ఉంటే సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు.


