అంతర్వేది..ఓ అంతులేని కథ!

ప్రాపర్టీ రిజిస్టరుకు రెక్కలొచ్చాయట

 

రథ నిర్మాణంలో అగ్నికుల క్షత్రియులకు అన్యాయం

 

ఆలయ కమిటీలో కొప్పనాటి వంశీయులకు చోటేదీ?

 

చర్చిల పాలవుతున్న ఆలయ భూములు

 

టీడీపీ-వైసీపీ-బీజేపీ మూడుస్తంభాలాట

 

అంతులేని ‘అంతర్వేది’ రాజకీయాలు

 

ఓ జమిందారు గారు తన సొమ్ముతో ఆలయ నిర్మాణం చేసి, దాని బాగోగులకు వందల ఎకరాలు దానం చేశారనుకోండి. అప్పుడు ఆ ఆలయానికి ఆ జమిందారు.. ఆయన వారసులు వ్యవస్థాపకులవుతారు కదా? ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా అలాంటి వంశ పారంపర్య హక్కును కొనసాగిస్తూ, అన్ని దేవాలయాలకూ భూములిచ్చి, సొంత నిధులతో గుడి నిర్మించిన వారి వారసులనే వ్యవస్థాపక అధ్యక్షులు, ట్రస్టీలుగా గుర్తిస్తోంది కదా? మరి ఈ నిబంధన.. ఒక్క అంతర్వేదిలోనే ఎందుకు అమలు కావడం లేదు? రాజకీయ ‘క్షత్రియుల’ చేతుల్లో ఆలయం ఎందుకు బందీగా మారింది? రక్షించాల్సిన క్షత్రియులు ఆలయ భూముల భక్షకులుగా ఎందుకు మారారు? ర థం తగులబడిపోతే దానిని తయారుచేయించి..  సంప్రదాయం ప్రకారం స్వామి వారికి ఇచ్చే అగ్నికుల క్షత్రియులకు కాకుండా, టెండర్లు కూడా లేకుండా ఇతరుల చేతికి ఎలా అప్పగిస్తారు? పది లక్షలకే తాము రథాన్ని తయారుచేసి ఇస్తామన్న అగ్నికుల క్షత్రియులకు కాకుండా, తెలంగాణలో ఉన్న ఆసామికి 14 లక్షలు పోసి ఆ కాంట్రాక్టు ఇవ్వడంలో మతలబేమిటి? ఆలయ భూముల్లో క్త్రైస్తవ ప్రార్ధనా మందిరాలు వెలుస్తున్నా, భూములు అన్యాక్రాంతమవుతున్నా,  అధికారులు ఎందుకు నిలువరించలేకపోతున్నారు? ఇవీ.. దుండగుల చేతిలో దహనమయిన, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ‘అంతులేని కథ’!

 

‘బ్రిటిషర్ల జమానాలో రాజులు శిస్తు కట్టకపోతే వారి భూములు వేలం వేశారు. దానిని అడ్డుకుని తానే సొమ్ము చెల్లించిన గొప్పవాడు కృష్ణమ్మ.  అంత వదాన్యుడు భూములిచ్చి, నిర్మించినదే ఈ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం’- ఇది ప్రతిఏటా జరిగే అంతుర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉత్సవాల్లో,  దేవదాయ శాఖ నిర్వహించే సాంస్కృతిక ప్రదర్శనలో కళాకారులు వినిపించే కథ. కానీ, అంత గొప్ప వదాన్యుడైన కొప్పనాటి కృష్ణమ్మ వారసులను.. ఇప్పుడు అక్కడ జరిగే ఉత్సవాలకు రానీయకుండా అడ్డుకుంటారు. లోపల స్థలం లేదు పొమ్మంటారు. అసలు ఆలయ కమిటీలో వారికే స్థానమే ఇవ్వరు. కృష్ణమ్మ వారసుడైన కొప్పనాటి శ్రీనివాసరావుకు ఇటీవల జరిగిన అవమానం. ఇదీ దాతల పట్ల దయచూపే పాలకుల తీరు. అది కాంగ్రెసయినా, తెలుగుదేశమయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా! అందరూ ఆ తాను ముక్కలే!!

 

అగ్నికుల క్షత్రియ కులానికి చెందిన,  కొప్పనాటి కృష్ణమ్మ అనే మహానుభావుడు బ్రిటీషు కాలంలోనే నౌకాయాన వ్యాపారి. రాజులు శిస్తు చెల్లించకపోతే వారి తరఫున ఆయనే డబ్బు చెల్లించేవారు. అలాంటాయన కష్టాల్లో ఉన్నప్పుడు.. లక్ష్మీనరసింహస్వామి కలలో కనిపించి, నీ బాధలు తీరతాయని అభయమిచ్చారట. దానితో కొట్టుకుపోయిన ఆయన ఓడలన్నీ ఒడ్డుకు చేరాయట. అందుకు ఆయన భక్తితో ఆలయానికి 1800 ఎకరాలు దానం చేసి, సొంత సొమ్ముతో ఆలయం, అందులో ఒక రథం నిర్మించారట. ఇదీ.. క్లుప్తంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయకథ. ఆ మేరకు శాసననాలు కూడా ఉన్నాయి. ప్రాపర్టీ రిజిస్టరులో వాటి వివరాలూ ఉన్నాయి అయినా, ఆ వంశానికి చెందిన వారసులకు ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ ఆలయ కమిటీలో స్థానం కల్పించలేదు. కృష్ణమ్మ వారసులకు ఆలయ బాధ్యత అప్పగించాలని, దశాబ్దాల నుంచి పోరాడుతున్న అగ్నికుల క్షత్రియులకు ఇప్పటివరకూ మిగిలింది కంఠశేష మాత్రమే.

 

టీడీపీ అధికారంలో ఉన్నప్పడయితే.. అగ్నికుల క్షత్రియుల కొత్త తరం నేతలు, అంతర్వేది ఆలయ పరిరక్షణ సమితి పేరుతో ఆందోళనలు నిర్వహించారు. విజయవాడలో 48 గంటల దీక్ష నిర్వహించారు. దానికి ఇప్పటి ‘గుళ్ల మంత్రి’ వెల్లంపల్లి శ్రీనివాస్, ఇప్పటి ఎంపీ మోపిదేవి వెంకట రమణ హాజరయ్యారు. తాము అధికారంలోకి వస్తే, కృష్ణమ్మ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది వారి పార్టీనే. నాడు ధర్నాలో పాల్గొన్న వెల్లంపల్లి ఇప్పుడు గుళ్లకు మంత్రయితే, మోపిదేవి రమణ ఎంపీ. అయినా ఫలితం శూన్యం.

 

అంతర్వేదిలో రథం తగులబడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాని స్థానంలో కొత్త రథం నిర్మిస్తామని వైసీపీ  సర్కారు చెప్పింది. దాని ఖరీదు 90 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. రథాన్ని తయారుచేసి, స్వామికి సమర్పించడం అగ్నికుల క్షత్రియుల ఆచారం. కానీ పాలకులు హైదరాబాద్‌లో ఉన్న గణపతి ఆచారి అనే వ్యక్తికి ఆ కాంట్రాక్టు ఇచ్చారట. తాము కేవలం 10 లక్షలకే రథం తయారు చేసి ఇస్తామని ముందుకొచ్చినా..  హైదరాబాద్‌లో ఉన్న వ్యక్తికి 14 లక్షలు, కలపకు మరో 80 లక్షలు ఖర్చు చేస్తామంటున్న సర్కారు తీరుపై, అగ్ని కుల క్షత్రియులు అగ్గిరాముళ్లలవుతున్నారు.

 

ఇప్పుడు రథ నిర్మాణానికి కలప కూడా కొనేశారు. పనులు మాత్రం హైదరాబాద్‌లో ఉన్న కాంట్రాక్టరుతో చేయిస్తున్నారు. అగ్నికుల క్షత్రియుల ఆందోళనకు అదీ ఓ కారణమే. ఆ రథ నిర్మాణ బాధ్యత మాకే ఇవ్వాలని, తమలోనూ నిపుణులున్నారన్నది వారి వాదన. కానీ వారికి ఆ బాధ్యత అప్పగిస్తే, ‘కమిషన’్ల కథమేటి? అందుకే అధికారులు అందుకు ససేమిరా అంటున్నారు. అన్నట్లు.. విశాఖ సర్కారీ స్వామి వారు,  రథాన్ని కలపతో నిర్మించాలని ఉచిత సలహా కూడా ఇచ్చారు.

 

కృష్ణమ్మ కుటుంబానికి స్థానం కల్పించాలని... ఎంత ఒత్తిడి చేసినా పట్టించుకోని టీడీపీ సర్కారు, ఇప్పుడు రథనిర్మాణంపై గొంతెత్తడమే ఆశ్చర్యం. ఆ బాధ్యతను అగ్నికుల క్షత్రియులకే ఇవ్వాలని, టీడీపీ నేత లోకేష్ ట్వీట్ చేయడం వింత. తాము అధికారంలో ఉన్నప్పుడు గాలికొదిలిన అంతర్వేది సమస్యలపై, ఇప్పుడు విపక్షంలోకి వచ్చిన అదే టీడీపీ ఆగ్రహించడం వింతల్లోవింత. మొన్నామధ్య అంతర్వేదికి వెళ్లి, హడావిడి చేసిన బీజేపీ కూడా తక్కువ తినలేదు. కృష్ణమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని నాటి బీజేపీ మంత్రి మాణిక్యాలరావును కోరినా, పట్టించుకున్న పాపాన పోలేదు. హిందూకార్డుతో రాజకీయాలు చేస్తున్చ బీజేపీ, ఇప్పుడు చిలకపలుకులు పలకడమే ఆశ్చర్యం.

 

అసలు అంతర్వేది భూముల్లో ఎన్ని తమ అధీనంలో ఉన్నాయి? ఎన్ని పరాధీనంలో ఉన్నాయో ప్రభుత్వాలకే తెలియకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. ఆలయ భూముల్లో క్రైస్తవ చర్చిలు కూడా నిర్మించారంటే, అధికారులు భూమల రక్షణ కోసం ఎంత బాగా పనిచేస్తున్నారో అర్ధమవుతుంది. ఇక స్థానికంగా ఓ ‘క్షత్రియ’ నాయకుడు..  నిర్వహకులను ముందుపెట్టి, ఆలయాన్ని శాసిస్తున్నారట. చాలావరకూ ఆలయ భూములన్నీ, సదరు క్షత్రియ నాయకుడి కుటుంబ బినామీల ఏలుబడిలోనే ఉన్నాయట. ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీలో చేరే సదరు నేత.. ఆ అధికార ముసుగులో, ఆక్రమించుకున్న భూములను కాపాడుకుంటున్నారట. అంతర్వేది కథలో ఇదో రకం కుట్ర కోణం! ప్రస్తుతం అంతర్వేది ఆలయం రాజకీయుల చేతిలో బందీగా మారింది.

ఆలయంలో నగలు, దాతలిచ్చిన వస్తువుల వివరాలను.. ప్రాపర్టీ రిజస్టరులో నమోదు చేస్తుంటారు. కానీ, ఇప్పుడా ప్రాపర్టీ రిజిస్టరుకు రెక్కలొచ్చాయంటున్నారు. దానిని చూపించాలని ఎంతమంది డిమాండ్ చేస్తున్నా, అదిగో ఇదిగో అంటూ అధికారులు తాత్సారం చేస్తున్నారు. దీన్నిబట్టి..  అసలు ప్రాపర్టీ రిజిస్టరు ఉందా? లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేనా ఆలయంలో కృష్ణమ్మకు సంబంధించిన శిలాశాసనాలు కూడా, సమాధి  చేసే కుట్ర జరుగుతోందన్నది అగ్నికుల క్షత్రియుల ఆరోపణ. మరి లక్ష్మీపార్వతి చెప్పినట్లు.. పక్కా హిందువయిన జగన్మోహన్‌రెడ్డి, అంతర్వేదిలో జరుగుతున్న అంతులేని కథకు ముగింపు ఎందుకు పలకడం లేదన్నది ప్రశ్న.

-మార్తి సుబ్రహ్మణ్యం