TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

క్యూ లైన్ పెద్దగా ఉంటోంది.. ఇంకో వైన్‌షాప్ కావాలి.. మందుబాబుల‌ రిక్వెస్ట్‌

Published on: Wed Feb 23, 2022 11:57AM

అస‌లే మందుకు ఫుల్ డిమాండ్ ఉంది. ఎండాకాలం స్టార్ట్ కావ‌డంతో.. బీర్లకు షార్టేజ్ ఉంది. పొద్దంతా ప‌ని చేసుకొచ్చి.. సాయంత్రం కాస్త మందేద్దామంటే.. వైన్ షాపుల ముందు పే..ద్ద క్యూ లైన్లు ఉంటున్నాయి. అప్ప‌టికే ప‌ని చేసి చేసి బాగా అల‌సిపోయి ఉంటున్నారు. మ‌ళ్లీ ఆ లైన్లో నిల్చోవ‌డం.. జ‌నంను తోసుకుంటూ మ‌ద్యం కొనుక్కోవ‌డం క‌ష్టంగా అనిపిస్తోంది. 

రోజూ అలా మ‌ద్యం షాపుల ముందు క్యూలో నిలుచోలేక‌పోతున్న‌.. ఓ మందుబాబుకు భ‌లే ఐడియా వ‌చ్చింది. త‌మ ప్రాంతంలో ఒక్క షాపు మాత్ర‌మే ఉండ‌టం వ‌ల్లే ఇంత డిమాండ్ ఉంది కాబ‌ట్టి.. ఇంకో వైన్ షాప్ పెట్టిస్తే పోలా.. అనుకున్నాడు. వెంట‌నే 'జై జ‌గ‌న‌న్న' అంటూ సీఎం జ‌గ‌న్‌రెడ్డికి ఓ జై కొట్టి.. త‌న డిమాండ్‌ను గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌కు విన్న‌వించుకున్నాడు. అది విని.. అవాక్క‌వ‌డం క‌లెక్ట‌ర్ వంతైంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే...

'డయల్ యువర్ కలెక్టర్' కార్యక్రమంలో భాగంగా గుంటూరు కలెక్టర్ వివేక్ యాద‌వ్‌కు చేబ్రోలుకు చెందిన ఓ మందుబాబు ఫోన్ చేశాడు. చేబ్రోలులో ఇంకో మద్యం షాపు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఉన్న ఒక్క మద్యం షాపు ద‌గ్గ‌ర‌ భారీ క్యూలైన్లు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. క్యూలైన్లలో వేచి ఉండలేక పోతున్నామని మరోషాపు ఏర్పాటు చేయాలని ఆ మందుబాబు కోరాడు. మందుబాబు సమస్య విని కలెక్టర్ విస్తుబోయారు. ఏం చెప్పాలో తెలీక‌.. సమస్య పరిష్కరిస్తామని చెప్పి కలెక్టర్ వివేక్ యాదవ్ ఆ కాల్ కట్ చేశారు. ఆ విష‌యం గురించి అంతా ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. ఆ మందుబాబు ఆలోచ‌న‌కు.. మిగ‌తా తాగుబోతులు జై కొడుతున్నారు.