ఏపీలో మరో కొత్త పార్టీ
Published on: Fri Aug 24, 2018 4:33PM
ఏపీ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి.. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీలు వచ్చే ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తోంటే, ఇప్పుడు కొత్తగా మరోపార్టీ తెరమీదకు వచ్చింది.. 2014లో వైసీపీ తరపున అరకు ఎంపీగా పోటీ చేసి గెలిచిన కొత్తపల్లి గీత కొన్నాళ్లుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.. ఒక దశలో టీడీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది.. కానీ అనూహ్యంగా ఆమె రాజకీయ పార్టీని స్థాపించారు.

తాజాగా విజయవాడలో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆమె, పార్టీ పేరు 'జనజాగృతి' అని ప్రకటించారు.. మార్పు కోసం ముందడుగు అనేది పార్టీ నినాదమని ఆమె చెప్పారు.. పార్టీ జెండాను కూడా ఆమె విడుదల చేశారు.. నీలం రంగుతో కూడిన జెండాపై గొడుగు చిహ్నం ఉంది.. ఈ సందర్భంగా ఆమె ప్రతిపక్ష నేత జగన్‌పై విమర్శలు గుప్పించారు.. జగన్ అసెంబ్లీకి వెళ్లరని, సమస్యలు ప్రస్తావించరని విమర్శించారు.. తాను డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశానని, నాలుగున్నరేళ్లు ఎంపీగా ఉన్నానని, విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహతో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు.. గిరిజన ప్రాంత సమస్యల్ని పార్లమెంట్‌లో ప్రస్తావించానని చెప్పారు.. రాజకీయ పార్టీలున్నది ప్రజల కోసమేనని ఆమె తెలిపారు.. మరి అనూహ్యంగా తెరమీదకు వచ్చిన ఈ కొత్త పార్టీ, ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి.


