TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ధూళిపాళ్ల‌పై మ‌రో కేసు.. ఈసారి కేసు ఏంటో తెలుసా..?

Published on: Sun Jun 6, 2021 3:49PM

వ‌ద‌ల బొమ్మాళీ అన్న‌ట్టు.. ధూళిపాళ్లను పోలీసులు వెంటాడుతున్నార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే సంగం డెయిరీలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డారంటూ కేసులు పెట్టి.. నరేంద్ర‌ను జైల్లో పెట్టిన ఖాకీలు.. తాజాగా ఆయ‌న‌పై మ‌రో కేసు న‌మోదు చేశారు. సంగం డెయిరీ వ్యవహారంలో ఇటీవలే బెయిల్‌పై విడుదలైన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌పైన విజ‌య‌వాడ‌లో కేసు న‌మోదైంది. ఆయ‌న‌తో పాటు సంగం డెయిరీ పాల‌క‌వ‌ర్గ స‌భ్యుల‌పైనా కేసు పెట్టారు పోలీసులు.
 
కరోనా ఆంక్షలు ఉల్లంఘించి మే 29న ఓ హోటల్ లో సమావేశం ఏర్పాటు చేశారన్న ఆరోపణలపై పటమట పోలీస్ స్టేష‌న్‌లో కేసు నమోదు చేశారు. కర్ఫ్యూ అమల్లో ఉండగా సమావేశం జరిపారనేది ఫిర్యాదు. సంగం డెయిరీ మీటింగ్‌కు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధూళిపాళ్లతో పాటు మిగ‌తా పాల‌క స‌భ్యుల‌పై ఐపీసీ 269, 270, రెడ్ విత్ 34, 188 సెక్షన్లతో పాటు, అంటువ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేశారు. సంగం డెయిరీ కంపెనీ కార్యదర్శిని పిలిపించి విచారణ జరిపారు పోలీసులు.

అయితే, తమపై కేసు నమోదు చేయడాన్ని సంగం డెయిరీ పాలకవర్గం ఖండించింది. తాము కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగానే సమావేశం నిర్వహించామని స్పష్టం చేసింది. కావాల‌నే పోలీసులు ఇలా కేసు పెట్టార‌ని ఆరోపిస్తున్నారు సంగం డెయిరీ స‌భ్యులు.