TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముగ్గురిని కాపాడి...తాను ప్రాణాలు కోల్పోయిన తెలుగు విద్యార్థి

Published on: Sun May 31, 2026 1:39PM

 

ఉన్నత చదువులు, కుటుంబ ఆశయాలు, భవిష్యత్తుపై ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువకుడు.. ముగ్గురు స్నేహితుల ప్రాణాలను కాపాడి తన ప్రాణాలను త్యాగం చేసిన ఘటన హృదయాలను కలచివే స్తోంది.   అతను మృతి చెందడంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లి గ్రామానికి చెందిన అనూప్ రెడ్డి కోటి ఆశలతో అమెరికాకు వెళ్ళాడు. అనూప్ రెడ్డి అమెరికాలోని University of North Texas లో కంప్యూటర్ సైన్స్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు.

 అమెరికాలోని లూసియాలో ఉన్న టోరోడో పార్క్ సమీపంలోని సెబాన్ రివర్‌కు తన ముగ్గురు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు నదిలో ఈతకు దిగిన వారు కొంతసేపటికే ప్రమాదంలో చిక్కుకున్నారు. నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ముగ్గురు స్నేహితులు ఆందోళనకు గురయ్యారు.ఆ క్లిష్ట సమయంలో ఏమాత్రం వెనుకాడకుండా అనూప్ రెడ్డి వారిని ఒక్కొక్కరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నించాడు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముగ్గురు స్నేహితులను రక్షించడంలో విజయం సాధించాడు. అయితే వారిని కాపాడి తాను ఒడ్డుకు చేరుకునే క్రమంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది.

నదిలో ఉన్న ఫిషింగ్ వైరు అనూప్ కాలుకు చుట్టుకోవడంతో అతడు నీటిలో చిక్కుకుపోయాడు. బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాకపోవడంతో చివరకు నీటిలోనే మునిగి ప్రాణాలు కోల్పోయాడు. తన స్నేహితుల ప్రాణాలను కాపాడిన హీరోగా నిలిచిన అనూప్, అదే సమయంలో మృత్యువు బారిన పడటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. చదువులో ప్రతిభ కనబరుస్తూ కుటుంబ సభ్యుల ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్న అతని అకాల మరణం తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. 

ఈ విషాద వార్త కవాడిపల్లి గ్రామానికి చేరుకోవడంతో గ్రామమంతా శోకసంద్రంగా మారింది. విదేశాల్లో ఉన్న తమ కుమారుడు గొప్ప స్థాయికి చేరుకుంటాడని కలలు కన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామస్థులు, బంధువులు అనూప్ ధైర్యసాహసాలను కొనియాడుతూ ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ముగ్గురు ప్రాణాలను కాపాడి.. తన ప్రాణాన్ని అర్పించిన అనూప్ రెడ్డి త్యాగం ఎన్నటికీ మరువలేనిదిగా నిలిచిపోనుంది. ఆయన మరణం విషాదాన్ని మిగిల్చినా, స్నేహితుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ధైర్యవంతుడిగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు.