అన్నవరం పంచాంగంపై భక్తుల ఆగ్రహం
Published on: Sat Apr 7, 2012 8:16AM
రాష్ట్రంలోని పెద్ద దేవాలయాల్లో అన్నవరం దేవాలం ఒకటి. ఇక్కడ ప్రతిఏటా ఉగాదినాడు కొత్త పంచాంగాన్ని విడుదల చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నందననామ సంవత్సర పంచాంగాన్ని దేవాలయాల్లో ఆర్భాటంగా ఆవిష్కరించారు. అయితే ఈ పంచాగం తప్పుల తడకలా ఉందని, దీనికితోడు అనేక అచ్చుతప్పులు కూడా కనిపిస్తున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంచి మూహూర్తాలు, దుర్ముహూర్తాలను బాగా పట్టించుకునే భక్తులు ఈ పంచాంగంలోని తిథి, వార నక్షత్రాలను పాటించి నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిథి వార నక్షత్రాలనే కాకుండా తేదీలను కూడా పంచాంగంలో తప్పుగా ముద్రించారు. ఈ పంచాంగం ప్రకారమే దేవాలయాల్లో పూజలు, పండుగలు జరపాలి. కాని దేవస్థానంలోని అధికారులు, పురోహితులు ఈ పంచాన్గంతో నిమిత్తం లేకుండా పనులు చేస్తున్నారు. ఈ పంచాగం ప్రకారం ఏప్రిల్ ఒకటిన నూతన ఆర్ధిక సంవత్సరం, కొత్త పుస్తకాలకు పూజలు జరపాల్సి ఉంది. అయితే దేవస్థాన పురోహితులు ఈ కార్యక్రమాన్ని రెండో తేదీన నిర్వహించారు. అలాగే సీతారాముల కళ్యాణ సదృశ్యం మూడో తేదీ ఏకాదశి మంగళవారం జరుగుతుందని పంచాంగంలో పేర్కొన్నారు. కానీ ఆ కార్యక్రమాన్ని కూడా ఒకరోజు ముందుగానే నిర్వహించారు. పంచాంగం చూసి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు మూడో తేదీన వచ్చిన కొంతమంది పండితులు, భక్తులు ఆ కార్యక్రమాలు రెండో తేదీన జరిగిపోయాయని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్ళుగా దేవస్థానం పంచాంగాన్ని విడుదల చేస్తున్నప్పటికీ ఎప్పుడూ ఇటువంటి పొరపాట్లు చోటుచేసుకోలేదని భక్తులు అంటున్నారు.


