TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికాలో అన్నమయ్య భారీ విగ్రహం!

Published on: Mon Mar 30, 2026 10:57AM

పదకవితా పితామహుడు అన్నమయ్య భారీ విగ్రహం అమెరికా గడ్డపై కొలువదీరనుంది. తెలుగు సాహిత్యంలో ధ్రువతారగా వెలుగొందిన తొలి వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు. 111 అడుగుల భారీ పంచలోహ విగ్రహాన్ని  అమెరికాలోని టెనెసీ రాష్ట్రం  మెంఫిస్ నగరంలోని ఇండియన్ కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ ఐసీసీటీ) ప్రాంగణంలో  ఏర్పాటు చేయనున్నారు.  

111 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకుంటున్న ఈ విగ్రహం విదేశీ గడ్డపై తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలవనుందనడంలో సందేహం లేదు.  ఈ భారీ అన్నమయ్య విగ్రహాన్ని  75 టన్నుల పంచలోహాలతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నత్తారామేశ్వరానికి చెందిన ప్రముఖ శిల్పి పెనుగొండ కరుణాకర్ ఉడయార్   విగ్రహానికి రూపకల్పన చేస్తున్నారు.

ఆధునిక త్రీడీ  సాంకేతికతను ఉపయోగించి విగ్రహం  భాగాలను విడివిడిగా తయారు చేస్తున్నారు. నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఈ విడి భాగాలను సముద్ర మార్గం ద్వారా అమెరికాకు తరలింలించి.. అక్కడ 160 టన్నుల భారీ ఉక్కు చట్రంపై ఈ భాగాలను అమర్చి, విగ్రహానికి తుది రూపు ఇస్తారు.  ఆధ్యాత్మికత,  ఆధునిక సాంకేతికత కలయికగా ఈ విగ్రహం రూపుదిద్దుకుంటోంది.   అన్నమయ్య జయంతిని పురస్కరించుకుని 2028, మే 9వ తేదీన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఐసీసీటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా భావితరాలకు అన్నమయ్య సంకీర్తనల గొప్పతనాన్ని, తెలుగు సాహితీ వైభవాన్ని చాటాలన్నది ఐసీసీటీ ఉద్దేశం.