లోక్‌పాల్‌కు రాజ్యసభ ఆమోదం

 

ఎట్టకేలకు అన్నా హజారే పోరాటం ఫలిచింది. అవినీతిని అరికట్టడానికి ప్రజా ఉద్యమాల ఫలితంగా రూపొందిన ఈ బిల్లుకు మంగళవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. చాలా రోజులుగా ఏవిషయంలోనూ కలిసి రాని చాలా పార్టీలు లోక్‌పాల్‌ విషయంలో మాత్రం ప్రభుత్వానికి సహకరించాయి. యుపిఏ మిత్ర పక్షం అయిన సమాజ్‌వాది పార్టీ మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేఖించింది.

2011 డిసెంబర్‌లోనే ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని అంశాలపై రాజకీయ పార్టీల అభ్యంతరాల వల్ల ఆమోదం పొందలేకపోయింది. అయితే తరువాత మెజార్టీ పార్టీల అభిప్రాయ సేకరణ తరువాత కొద్ది పాటి మార్పులతో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. మంగళవారం సభలో న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్... లోక్‌పాల్ బిల్లుపై చర్చ ప్రారంభించారు.

అదే సమయంలో ప్రతిపక్షనేత అరుణ్‌జైట్లీ కూడా బిల్లుకు మద్దతు తెలపటంతో బిల్లు ఆమోదం పొందింది. అయితే ప్రతిపక్షాలు లోక్‌పాల్‌ పరిదిపై మాత్రం పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరాయి.కార్పోరేట్ రంగాన్ని కూడా లోక్‌పాల్ పరిధిలోకి తేవాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి కోరారు. సీపీఐ, బీఎస్పీ, జేడీయూ, అన్నాడీఎంకే, టీడీపీ తదితర పార్టీలు కూడా బిల్లుకు మద్దతు తెలిపాయి. మరోవైపు ఆది నుంచీ బిల్లును వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేసింది.