TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కలకలం రేపిన కెజ్రీవాల్

Published on: Mon Feb 27, 2012 9:46AM

న్యూఢిల్లీ: అన్నా హజారే బృందం మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఎంపీలపై నోరుపారేసుకుని ఆ కూటమి సభ్యుడు అరవింద్ కెజ్రీవాల్ కలకలం రేపారు. రేపిస్టులు, హంతకులు, దోపిడీదారులంటూ ఎంపీలను అభివర్ణించి రాజకీయ పార్టీల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించారు. కెజ్రీవాల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు పార్లమెంట్‌కే అవమానమని అన్ని పార్టీలు విరుచుకుపడ్డాయి. ఆయనకు పార్లమెంట్‌పైనా, రాజ్యాంగం పట్ల ఎలాంటి విశ్వాసం లేదని చెప్పడానికి పరుష వ్యాఖ్యలే నిదర్శనమని పేర్కొన్నాయి. కాగా, కెజ్రీవాల్‌పై పార్లమెంట్‌లో హక్కుల తీర్మానం తీసుకొస్తామని ఆర్‌జెడి ప్రకటించింది. ‘పార్లమెంట్‌లో 163మందిపై అత్యంత హేయమైన కేసులున్నాయి. ఈ సమున్నత వేదికలో రేపిస్టులు, హంతకులు కూర్చుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనలోక్‌పాల్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందని ఎలా భావిస్తామని’ యూపీ ప్రచారంలో కెజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యల ద్వారా కెజ్రీవాల్ ఎంపీలనే కాకుండా పార్లమెంట్‌ను, సభ్యుల్ని ఎన్నుకున్న ఓటర్లనూ అవమానించారని ఆర్‌జెడి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌క్రిపాల్ యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కెజ్రీవాల్ మాట్లాడారని, ఇది ఆయన దురహంకారానికి నిదర్శనమని బిజెపి విరుచుకు పడింది.