అన్నాహజారే మనసు కరుగుతోందా

 

ఒకప్పుడు అన్నాహజారేతో కలిసి జనలోక్ పాల్ బిల్లుకోసం ఉద్యమించిన అరవింద్ కేజ్రీవాల్, ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలను పనిచేయించలేమని గ్రహించి, మార్పు తేవాలంటే స్వయంగా రాజకీయాలలో ప్రవేశింఛి అందుకు కృషి చేయడమే మార్గమని భావించడంతో, నాటి నుండి వారిరువురి దారులు వేరయిపోయాయి. ఆ తరువాత గత ఏడాది కాలంగా డిల్లీ ప్రజల సమస్యలపై అరవింద్ కేజ్రీవాల్ అనేక పోరాటాలు చేసారు కూడా. కానీ అవన్నీదున్నపోతు మీద వానలాగే డిల్లీ ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి. ఆ తరువాత ఆయన ఆమాద్మీ పార్టీని స్థాపించడం, దానితో డిల్లీ ప్రజలందరూ మమేకం కావడం, ఆయన డిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అన్నీచకచకా జరిగిపోయాయి.

 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టిననాటి నుండి ఆయన అయన అనుచరుల నిజాయితీతో కూడిన మాటలు, చేపడుతున్న చర్యలు చూసిన తరువాత బహుశః అన్నాహజారే మనసు క్రమంగా కరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఇటీవల ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “వ్యక్తులు రాజకీయాలలోకి చేరడం నేరమని నేను భావించడం లేదు. కానీ వాటిలో చేరిన తరువాత వారి ప్రమేయం లేకుండానే అవినీతి, లంచగొండితనమూ,అధికార లాలసలో మునిగిపోతారనే ఉద్దేశ్యంతోనే నేను రాజకీయాలలో చేరడాన్ని వ్యతిరేఖిస్తున్నాను. అయితే అరవింద్ కేజ్రీవాల్ ని నేను చాలా కాలంగా చూస్తున్నాను. ఆయన చాలా నీతి, నిజాయితీ గల వ్యక్తి. ఇప్పుడు కూడా ఆయన అదేవిధంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వంలో అవినీతిని పారద్రోలి మిగిలిన రాజకీయ నేతలకు పార్టీలకు ఆదర్శంగా నిలవాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు.

 

అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్స్వానికి కూడా హాజరవడానికి ఇష్టపడని అన్నాహజారే ఇప్పుడు ఈవిధంగా మాట్లాడటం చూస్తే కొంచెం మెత్తబడుతున్నట్లు అర్ధం అవుతోంది. బహుశః అరవింద్ కేజ్రీవాల్ మాటలలో నిజాయితీని అన్నాహజారే గుర్తించినందునే ఆయనలో ఈ మార్పు వచ్చినట్లు కనబడుతోంది. ప్రభుత్వం మరియు ఇతర వ్యవస్థల నుండి అవినీతిని పారద్రోలడం తన ఒక్కడివల్లే కాదని, అందుకు అందరూ కలిసి కృషి చేద్దామని అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపుకు, అన్నాహజారే కూడా సానుకూలంగా స్పందించినట్లు భావించవచ్చును.

 

ఇద్దరి గమ్యం ఒకటే గనుక, ఆయన కూడా ఆమాద్మీ ప్రభుత్వం వెనుక నిలబడితే ఇక ప్రక్షాళణా కార్యక్రమం వేగవంతమవుతుంది. అదేసమయంలోల్ అమాద్మీ ప్రభుత్వం గాడి తప్పితే హెచ్చరిస్తూ ఉండవచ్చును. అంతేగాక అన్నాహజారే వచ్చిఆమాద్మీ పక్కన నిలబడితే, ఇక కాంగ్రెస్, బీజేపీలు ఎటువంటి దుస్సాహసానికి పూనుకొనే ధైర్యం చేయలేవు కూడా. అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఒక మంచి ప్రయోగానికి అన్నాహజారే వంటివారు కూడా ముందుకు వచ్చి తమ సహకారం అందిస్తే, తప్పకుండా అది విజయవంతమవదమే కాక అది క్రమంగా దేశమంతటా వ్యాపించే అవకాశం ఉంటుంది.