ఒక్కొక్కటిగా మూతపడుతున్న అన్నా క్యాంటీన్లు...మొత్తానికి మూసేస్తారా ?

గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాల్లో అన్నా క్యాంటిన్లు ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.5కే పేదల ఆకలి తీర్చేందుకు చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన్ అన్న క్యాంటీన్లు మూతపడబోతున్నాయి. అన్న క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి ఏడాది కాంట్రాక్టు అక్షయపాత్ర ఫౌండేషన్‌తో ప్రభుత్వం కుదుర్చుకుంది. అయితే ఆ గడువు జులై 31వ తేదీతో ముగుస్తుంది. 

అయితే ఈ కాంట్రాక్ట్ పొడిగింపుపై ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో అన్న క్యాంటీన్లు మూతపడటం ఖాయమని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 210అన్న క్యాంటీన్లు ఉన్నాయి. వీటిలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రివేళల్లో భోజనం రూ.5చొప్పున అందిస్తుండేది ప్రభుత్వం. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు రాజన్న క్యాంటీన్లుగా నడుపుతారని భావించినప్పటికీ అవి ఇప్పుడు ఒక్కక్కటిగా పూర్తిగా మూసివేస్తున్నారు. 

 ముందుగా మూత బడిన క్యాంటీన్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం సమీపంలో ఉన్నదే కాగా అది మొదలు రాష్ట్రవ్యాప్తంగా చాలా క్యాంటీన్లు మూతబడుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, అద్దంకి, కనిగిరి, గిద్దలూరులలోని క్యాంటీన్లు, కర్నూలు జిల్లా ఆదోనితో పాటు మరో రెండు క్యాంటీన్లు, నెల్లూరులో రెండు క్యాంటీన్లు మూతబడినట్లు సమాచారం. క్యాంటీన్లన్నీ అక్షయపాత్ర పథకంతోనే నడుస్తుండగా హరే కృష్ణ ఫౌండేషన్ కి ప్రభుత్వం కోట్లలో బకాయి ఉంది. అవి చెల్లించకపోవడంతో నెల రోజుల నుంచి క్యాంటీన్లలో పెరుగు, మజ్జిగ ఏమీ లేకుండా? కేవలం సాంబారు, ఓ కూరతో రూ.5 కే భోజనం అందిస్తున్నారు. 

అయితే బిల్లులను చెల్లించకపోవడంతోనే మూతబడుతున్నాయని చెబుతున్నారు. ముందుగా గత ప్రభుత్వ తాలూకూ గుర్తులు తొలగించి కాంటీన్లను కంటిన్యూ చేయాలనే అనుకున్నా రంగులు మార్చినా ఫోటోలు మారినా అన్నా క్యాంటీన్లగా గుర్తింపు ఉంటుందన్న భావనలోనే ఈ ప్రభుత్వం మనసు మార్చుకున్నట్లుగా విశ్లేషణలు వినవస్తున్నాయి. ఒక్కో క్యాంటీన్‌లో రోజుకు దాదాపు వెయ్యిమంది వరకూ భోజనాలు చేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. తొలుత రోజుకు 800మందికి, ఆ తర్వాత 600మందికి మాత్రమే ఆహారం అందజేశారు.