TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొత్త పార్టీ.. బీసీ సీఎం.. ఏంటి బావా సంగ‌తి!?

Published on: Mon Mar 14, 2022 7:03PM

ఏపీలో కొత్త రాజకీయ శక్తి ఆవర్భించబోతున్నదా? ముఖ్యమంత్రి సాక్షాత్తు బావ, మతబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ వారం పదిరోజుల్లోనే రాష్ట్రంలో రెండుసార్లు దర్శనమివ్వడం ఈ అనుమానానికి తావిస్తోంది. ఈ రెండుసార్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలతో సమావేశం కావడం, వాళ్ళ నుంచి అభిప్రాయాలు సేకరించడం... రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాలని వారు సూచించడం... ఆయన దాన్ని ఖండించకపోగా, మీ సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత తన మీద ఉంటూ భరోసా ఇవ్వడం వంటి పరిణామాలన్నీ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ ఊహాగానాలకు తెరతీస్తున్నాయి. ఈ కొత్త పరిణామాలపై జగన్ అంతరంగం ఏమిటో వైకాపా శ్రేణులకు కూడా అంతుచిక్కడం లేదు. 

ఇప్పటికే అటు కోర్టు మొట్టికాయలు, ప్రతిపక్ష దాడులతో ముఖ్యమంత్రి జగన్ స్వంత బావ బ్రదర్ అనిల్ కుమార్ పక్కలో బల్లెంలా మారుతున్న పరిస్థితికి ఎలా స్పందిస్తారనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. బ్రదర్ అనిల్ కుమార్ ప్రస్తుతం పదే పదే కలుస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలే గత ఎన్నికల్లో జగన్ కు భారీగా ఓట్లు వేసి గెలిపించారు. వారి కోసమేనంటూ జగన్ ప్రభుత్వం ‘నవరత్నాలు’ పేరుతో పథకాన్ని అమలు చేస్తూ వారికి చేరువుగా ఉండే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో బ్రదర్  అనిల్ కుమార్ వారిని కలవడం, వారు అసంతృప్తితో ఉన్నారంటూ మీడియాకు చెప్పడం వైకాపా శ్రేణుల్లో కలకలాన్ని రేకెత్తిస్తోంది. 

ఎందుకంటే, ప్రముఖ మత బోధకుడు అయిన బ్రదర్ అనిల్ కుమార్ కు ఆంధ్ర రాష్ట్రంలో మంచి ఫాలోయింగే ఉంది. ఇటీవలే బ్రదర్ అనిల్ మాజీ కాంగ్రెస్ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తో సమావేశం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తర్వాత విజయవాడలో కూడా పలు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. తాజాగా సోమవారంనాడు బ్రదర్ అనిల్ కుమార్ ఉత్తరాంధ్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలతో సమావేశం కావడం, వారు ఎపీలో కొత్త పార్టీ పెట్టాలని కోరారని చెప్పడం ఆ దిశగా సంకేతాలను బలపరుస్తున్నాయి. అయితే, కొత్త పార్టీ పెట్టడం చాలా పెద్ద విషయమని చెప్తూ విషయాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశారు. 

ఇప్పటికే భార్య వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణా పార్టీని ప్రారంభించి, అధ్యక్షురాలిగా కార్యకలాపాలు నడిపిస్తున్నారు.  ఈ క్రమంలో బ్రదర్ అనిల్ ఆంధ్ర ప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులతో పదే పదే సమావేశాలు నిర్వహించడం, వారంతా తమ పరిస్థితిని వినే వాళ్ళు ఎవరూ లేరంటూ ఫిర్యాదు చేశారని మీడియాకు చెప్పడం దేనికి సంకేతం? పైగా, ఎన్నికలకు ముందు వారి సహాయం తీసుకున్నామని, ఎన్నికలు  పూర్తైన తర్వాత వారిని పట్టించుకోకపోవడం పట్ల అసంతృప్తితో ఉన్నారని చెప్పుకురావడంతో రాజకీయ వర్గాలలో పలు ఊహాగానాలు సాగుతున్నాయి.  ముఖ్యంగా, పాఠశాల వ్యవస్థలో ఏపీ ప్రభుత్వం తెచ్చిన మార్పుల కారణంగా క్రైస్తవ ఛారిటీ నిధులతో నడుస్తున్న పాఠశాలలు తీవ్రంగా నష్టపోతున్నాయని, వారి ప్రతినిధులు ప్రభుత్వానికి తమ వెతలు చెప్పుకుందామన్నా తమకు ముఖ్యమంత్రి కానీ, అధికారులు కానీ సమయం ఇవ్వడం లేదని తనకు చెప్పుకున్నారని అనిల్ కుమార్ చెప్పుకొచ్చారు. 

కాగా, గత రెండు మూడు రోజులుగా జన సేన నాయకులు తమ అధినేత సోమవారం జన సేన ఆవిర్భావ సభ సందర్భంగా జగన్ పై యుద్ధ భేరి మోగించబోతున్నారని, ఈసారి ఎన్నికలలో జగన్ పని అయిపోతుందన్న్నట్టుగా రెచ్చగొట్టే స్థాయిలో ప్రకటనలు ఇస్తున్నారు. అయితే, ఒక వైపు జనసేన ఆవిర్భావ సభ జరుగుతుంటే, మరోవైపు బ్రదర్ అనిల్ కుమార్ తన సంచలన ప్రకటనలతో మీడియా దృష్టిని, సమయాన్ని ఆకర్షించడం విశేషం.