కోపం ఒక విషవలయం!

హరి మనసేం బాగోలేదు. పొద్దున లేవగానే భార్యతో గొడవైంది. మాటామాటా పెరిగింది. ఆ గొడవతో అతని భార్య స్వాతి మనసు కూడా చిరాకుగా మారిపోయింది. హరి ఆఫీసుకి వెళ్లేసరికి అక్కడ సురేష్‌ నవ్వుతూ ఎదురుపడ్డాడు. అతను హరి పక్కనే కూర్చుని ఏదో జోక్‌ చేయబోయాడు. కానీ హరి దాన్ని ఆస్వాదించే మూడ్‌లో లేడు. సురేష్‌ మాటలకి చాలా ముభావంగా స్పందించాడు. పైగా ‘నన్ను కాస్త ఒంటరిగా వదిలెయ్!’ లాంటి మాటేదో వాడేసాడు.

హరి ముభావంగా ఉండటం, పుల్లవిరుపుగా మాట్లాడటం చూసి సురేష్‌కి కూడా చిరాకు మొదలైంది. ‘వీడి దగ్గరకి వెళ్లి కాలక్షేపం చేయడానికి నాకేంటి పని!’ అనుకున్నాడు. ఆ చిరాకుతోనే తన డెస్క్‌ దగ్గరకి వెళ్లి సిస్టమ్‌ ఆన్‌ చేశాడు. ఆ చిరాకుతోనే అస్తవ్యస్తంగా పనిచేయసాగాడు. చూస్తూ చూస్తుండగానే అతనికి తన పని మీదా, ఆ ఆఫీసు మీదా, ఉదయం క్యారియర్‌ ఇవ్వని తన భార్య మీదా కోపం మొదలయ్యాయి. క్యారేజీ సర్దని తన భార్యతో మనసులోనే వాదించడం మొదలుపెట్టాడు.

సురేష్‌ మెదడు మాంచి వేడిగా ఉన్న సమయంలో, తన భార్య నుంచి ఫోన్‌ వచ్చింది- ‘భోజనం చేశారా?’ అంటూ! అంతే, పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఫోన్‌లోనే ఒక్కసారిగా విరుచుకుపడిపోయాడు. ‘నేను పస్తులుండటమేగా నీకు కావాల్సింది!’ అంటూ దెప్పిపొడిచాడు.

సురేష్‌ మాటలకి అతని భార్య మీనా కళ్లు చెమర్చాయి. వండుకున్న అన్నం కూడా తినకుండా అలాగే పడుకుండిపోయింది. ఈలోగా మీనా ఇంటి తలుపు ఎవరో తట్టారు. కళ్లు తుడుచుకుని చూస్తే పనిమనిషి. ‘పనికి రావాల్సిన సమయమేనా ఇది! మిట్టమధ్యాహ్నం భోజనాలు చేసి, అంతా పడుకునే సమయానికి వచ్చి ఇబ్బంది పెట్టడానికి కాకపోతే ఇప్పుడెందుకు వచ్చినట్లు!’ అనిపించింది ఆ మనిషిని చూసిన వెంటనే. అసలే భర్త చేతిలో చివాట్లు తిన్న చిరాకులో ఉన్న మీనా... పనిమనిషిని ఎడాపెడా దులిపేయడం మొదలుపెట్టింది.

మీనా మాటలన్నీ పనిమనిసి కిక్కురుమనకుండా విన్నది. ఆపై తను ఎందుకంత ఆలస్యంగా వచ్చిందో చెప్పుకొచ్చింది. తన భర్త అనారోగ్యం గురించీ, కుటుంబ పోషణ కోసం తను పడుతున్న కష్టం గురించీ చెప్పుకొచ్చింది. మీనా కాస్త శాంతించిన తర్వాత తన సహజశైలిలో సరదాగా కబుర్లు చెబుతూ పనిచేయడం మొదలుపెట్టింది. ఆ మాటా ఈ మాటా చెబుతూ చకచకా పని సాగించింది.

ఓ పదినిమిషాలు గడిచేసరికి మీనా మనసులోని దిగులు కాస్తా తీరిపోయినట్లు తోచింది. తను కూడా మాటలు కలుపుతూ, నవ్వడం మొదలుపెట్టింది. కానీ మనసులో ఏదో ఒక మూల తన భర్త నొచ్చుకున్నాడన్న దిగులు మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ దిగులుని పోగొట్టుకునేందుకు మరోసారి భర్తకి ఫోన్‌ చేసింది. ఆపాటికే సురేష్‌ బయట సుష్టుగా భోజనం చేసి తన డెస్కులోకి చేరుకున్నాడు. తన భార్య మీద నోరు పారేసుకున్నందుకు నొచ్చుకుంటున్నాడు. మళ్లీ సాయంత్రం తనతో ఎలా మాటలు కలపాలా అన్న సందిగ్ధంలో ఉన్నాడు. ఆ సమయానికి భార్యే ఫోన్‌ చేయడంతో అతని మనసు కాస్తా తేలికపడిపోయింది. ఫోన్లో ఓ రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఉదయం పోయిన హుషారు తిరిగి వచ్చినట్లయ్యింది.

సురేష్‌ తన పనిలో ఉండగానే హరి మరోసారి ఎదురుపడ్డాడు. ‘పొద్దున్న పాపం ఏదో చిరాకులో ఉన్నట్లున్నాడు. నేనే అనవసరంగా అతన్ని ఇబ్బంది పెట్టాను!’ అనిపించింది. అందుకనే మళ్లీ సరదాగా హరిని కబుర్లోకి దింపే ప్రయత్నం చేశాడు.

ఒకటికి రెండుసార్లు సురేష్‌ తనతో సరదాగా ఉండే ప్రయత్నం చేసి హరి మనసు కూడా తేలికపడింది. తాను కూడా సురేష్‌తో మాట కలిపాడు. తను కూడా నాలుగు సెటైర్లు వేసే ప్రయత్నం చేశాడు. చూస్తూచూస్తుండగానే ఆఫీసు సమయం అయిపోయింది. పెద్దగా పని ఒత్తిడి లేకుండానే ఆ రోజు ఆఫీసు గడిచిపోయింది. కానీ తన భార్యతో పడిన గొడవ తాలూకు ఒత్తిడి మాత్రం అతని మనసు మీద ఇంకా పనిచేస్తూనే ఉంది. ‘ఛా! ఒక్క చిన్న మాటతో మొదలైన గొడవ కాస్తా రాద్ధాంతం అయిపోయింది. నాకు ఈమధ్య  కోసం ఎక్కువైపోతోంది,’ అనుకున్నాడు. తన భార్యకి సారీ చెప్పడం కోసం ఫోన్‌ చేతిలోకి తీసుకున్నాడు.

ఈ కథలో అయిదు పాత్రలే ఉన్నాయి. కానీ మన జీవితంలో అంతకు లెక్కకు మించిన మనుషులు ఎదురుపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిదీ ఒకో కష్టం, ఒకో సమస్య, ఒకో వ్యక్తిత్వం. ఆ క్షణంలో వారు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు అనేదాని వెనుక అనేక కారణాలు. ఈ నిమిషానికి వారితో మనకి ఉన్న సమస్యని అర్థం చేసుకునో, పరిష్కరించుకునో... రెండూ కుదరకపోతే కాసేపు పక్కకు తప్పుకునో ఉంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. లేకపోతే ఎక్కడికక్కడ కొత్త వివాదం మొదలవుతూనే ఉంటుంది. ప్రతి బంధమూ బరువైపోతుంది. అంతేకాదు! ఆ కోపాన్ని, దుఃఖాన్నీ మనసులో నింపుకుని ముందు సాగితే... మన చిరాకుని చుట్టుపక్కల వారితో కూడా పంచుకున్నాట్లు అవుతుంది. వారి జీవితాలని కూడా ప్రభావితం చేస్తుంది.

వీలైతే మన కోపానికి పరిష్కారాన్ని వెతుక్కోవాలి. లేదా కనీసం దాన్ని ఇతరులకి బదలాయించుకోకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మన దగ్గరకే ఎవరన్నా చిరాకుతో వస్తే ఆ విషవలయాన్ని అక్కడితో ఛేదించాలి.

- నిర్జర.