TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మరో వివాదంలో సంధ్య కన్వెన్షన్ వ్యాపారవేత్త శ్రీధర్ రావు

Published on: Tue Apr 21, 2026 10:10AM

 

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేస్తున్న భారీ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. ప్రముఖ కన్వెన్షన్ వ్యాపారవేత్త శ్రీధర్ రావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనతో పాటు భార్య సంధ్యపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ ఘటన నగరవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఎథెనా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. పోలీసుల వివరాల ప్రకారం, ఈ దంపతులు హైదరాబాద్ నగరంలోని ప్రైమ్ ప్రాంతాల్లో ఉన్న విలువైన భూములు తమవేనని చెప్పి సంస్థ ప్రతినిధులను నమ్మించారు.

ఈ క్రమంలో నకిలీ పత్రాలు సృష్టించి, వాటి ఆధారంగా ఒప్పందాలు కుదుర్చుకుని, అడ్వాన్స్ పేరుతో సుమారు రూ.14.50 కోట్లు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత భూముల రిజిస్ట్రేషన్ విషయంలో పలుమార్లు అడిగినా వివిధ కారణాలు చెబుతూ తప్పించుకుంటూ వచ్చారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. చివరకు డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో బెదిరింపులకు దిగారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శ్రీధర్ రావు, అతని భార్య సంధ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంధ్య కన్వెన్షన్‌కు చెందిన వ్యాపారవేత్త శ్రీధర్ రావుపై గతంలో కూడా పలు కేసులు నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరోసారి కలకలం రేగింది.