TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ నోటీసులు

Published on: Thu Apr 17, 2025 1:05PM

మద్యం కుంభకోణం దర్యాప్తులో  స్పీడ్ పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తాజాగా ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.  సిట్ నోటీసుల మేరకు మిథున్ రెడ్డి  శుక్రవారం (ఏప్రిల్ 18) విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సిట్ నోటీసులపై మిథున్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. గతంలో కూడా ఇదే మద్యం కుంభకోణం కేసులో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని పేర్కొంటూ మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు అప్పట్లో ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మిథున్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, విచారణకు సహకరించాలని మిథున్ రెడ్డిని ఆదేశించిన సుప్రీం కోర్టు ఆయనను అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డికి సిట్ శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన గురువారం (ఏప్రిల్ 17) హైకోర్టును ఆశ్రయించారు.  సిట్ విచారణ సందర్భంగా తనతో పాటు న్యాయవాదిని కూడా అనుమతించాలని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో కోరారు. అలాగే సిట్ విచారణకు సంబంధించి ఆడియో, వీడియో రికార్డు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని కూడా ఆయన కోరారు. కాగా మిథున్ రెడ్డి పిటిషన్ ను హైకోర్టు ఈా రోజు విచారించనుంది.  

ఇలా ఉండగా ఇదే కేసులో సిట్ నోటీసుల మేరకు ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గైర్హాజరయ్యారు. సిట్ నోటీసులపై స్పందించిన విజయసాయిరెడ్డి తాను రెండు రోజులు ముందుగానే విచారణకు హాజరౌతానని కోరడంతో సిట్ అనుమతించి గురువారం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సిట్ విచారణకు విజయసాయి గైర్హాజరయ్యారు. అదే విధంగా ఇదే కేసులో ఇప్పటికే మూడు సార్లు నోటీసులు అందుకుని కూడా విచారణకు డుమ్మా కొట్టిన కసిరెడ్డి రాజశేఖరరెడ్డికి సిట్ నాలుగో సారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.