TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆంధ్రా బియ్యానికి వియత్నాం ఎఫెక్ట్

Published on: Tue Feb 28, 2012 3:48PM

రాష్ట్రంనుంచి నిలిచిపోయిన ఎగుమతులు
హైదరాబాద్: విదేశాలకు బియ్యం ఎగుమతులు ఆగిపోవడంతో పాటు గోదాములు, రైల్వే వ్యాగన్ల కొరత కారణంగా లెవీ సేకరణ మందగించడంతో ధాన్యం కొనుగోళ్ళు దాదాపు నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రైస్ మిల్లర్లు ధాన్యాన్ని కొనేందుకు ఆసక్తి చూపడంలేదు. కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో బియ్యానికి డిమాండ్ లేకపోవడమేకాక వియత్నాంనుంచి గట్టి పోటీ ఎదురవడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని కాకినాడ పోర్టు ద్వారా బాయిల్డ్ బియ్యాన్ని దక్షిణాఫ్రికా దేశాలకు, పచ్చి బియ్యాన్ని మధ్యఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే మనదేశ మార్కెట్ కు వియత్నాం నుంచి తీవ్ర పోటీ ఎదురయింది. మనకన్నా మంచి క్వాలిటీ బియ్యాన్ని తక్కువ ధరకే ఆ దేశం అందిస్తుండటంతో మనదేశ బియ్యానికి విదేశీ మార్కెట్లో డిమాండ్ తగ్గింది. ఇప్పటివరకు బియ్యంలో 10శాతం నూకలున్న క్వింటాల్ పచ్చబియ్యాన్ని రూ.1950 కొనగా ఆ ధర అకస్మాత్తుగా రూ. 1800లకు పడిపోయింది. బాయిల్డ్ బియ్యం క్వింటాలు ధర రూ.2050 నుంచి రూ.1900 తగ్గింది. వియత్నాం ఎఫెక్ట్ కారణంగా ఎగుమతులు ఆగాయి. ఎగుమతి లైసెన్స్ ఉన్న రైస్ మిల్లర్లు ధాన్యాన్ని కొనడం నిలిపివేశారు. ఈ ధరలు మరింత పతనమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.