ఆంధ్రాలో నల్ల బంగారం గనులు

 

రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి గురించి ఆందోళన పడుతున్న సమయంలో అప్పుడప్పుడు కొన్ని తియ్యటి వార్తలు వీనుల విందుగా వినుపిస్తుంటే ప్రభుత్వానికే కాదు ప్రజలకు కూడా చాలా సంతోషం కలుగుతుంది.

 

రాష్ట్రంలో అనేక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఉన్నప్పటికీ తీవ్ర బొగ్గు కొరత కారణంగా తరచూ ఉత్పత్తి నిలిచిపోతుండేది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేప్పట్టిన అనేక చర్యల కారణం క్రమంగా బొగ్గు సరాఫరా మెరుగుపడడంతో మళ్ళీ విద్యుత్ ఉత్పత్తి కూడా గాడిలో పడింది. అయినా నేటికీ ఇంకా బొగ్గు కొరత వేధిస్తూనే ఉంది. ఇటువంటి సమయంలో, దేశంలో వివిధ సంస్థలకు కేటాయించిన బొగ్గు గనులను రద్దు చేసిన సుప్రీంకోర్టు ఓడిషాలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన బొగ్గు గనులను మాత్రం రద్దు చేయకపోవడంతో అక్కడ లభించే 240 మిలియన్ టన్నుల బొగ్గునిక్షేపాలను ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు రెండు కలిసి త్రవ్వుకోనేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేసుకొంటున్నాయి. అందులో ఆంధ్రా వాటాగా 120 టన్నుల బొగ్గు రాష్ట్రానికి దక్కుతుంది. ఇదే సమయంలో మరో శుభవార్త కూడా వినిపించడం విశేషం.

 

లక్నోనగరంలో గల బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ డిశంబర్ 2013లో కృష్ణ, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో చేసిన ఒక అధ్యయనంలో కృష్ణా జిల్లా సోమవరం నుండి తూర్పు గోదావరిలో రాజమండ్రీ వరకు గల అనేక ప్రాంతాలలో చాలా నాణ్యమయిన బొగ్గు నిక్షేపాలున్నట్లు కనుగొన్నారు. అవి ఏకంగా 3,000 మిలియన్ టన్నుల వరకు ఉంటాయని ఆ సంస్థ అంచనా వేసింది. అంతే కాదు ఇరుగు పొరుగు రాష్ట్రాలలో బొగ్గు గనులలో దొరికే బొగ్గుతో పోల్చి చూస్తే ఇక్కడ దొరికే బొగ్గు వాటి కంటే చాలా నాణ్యమయిందని స్పష్టం చేసారు. ఈ బొగ్గు గనులు భూ ఉపరితలానికి కేవలం 500 మీటర్ల లోతులోనే ఉన్నట్లు ఆ సంస్థ గుర్తించింది.

 

ఈ గనులలో అత్యంత నాణ్యమయినవి అశ్వారావు పేట (తెలంగాణాలో ఖమ్మం జిల్లా), చింతలపూడి, జంగారెడ్డి గూడెం( పశ్చిమ గోదావరి జిల్లా), చాట్రాయి మండలం (కృష్ణ జిల్లా) మరియు రాజమండ్రీ (తూర్పు గోదావరి జిల్లా)లలో వ్యాపించి ఉన్నాయని ఆ సంస్థ తెలియజేసింది.

 

ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో వివిధ సంస్థల నుండి చాలా అధికధరలు చెల్లించుతూ బొగ్గు కొనుగోలు చేస్తోంది. కానీ ఇప్పుడు ఒడిషా రాష్ట్రంలో వాటా దొరకడమే కాకుండా, రాష్ట్రంలోనే భారీ బొగ్గు నిక్షేపాలు బయటపడటం చాలా మంచి వార్త.

 

బొగ్గు గనులున్న చోటే అనేక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు కూడా పుట్టుకొస్తాయి. విద్యుత్ సరఫరా బాగుంటే కొత్తగా పరిశ్రమలు కూడా ఏర్పాటవుతాయి. ఈ బొగ్గు గనుల త్రవ్వకాలకు, సరఫరాకు అనేక కంపెనీలు వస్తాయి, కనుక వాటి ద్వారా కూడా యువతకు ఉపాధి, రాష్ట్రానికి అదనపు ఆదాయం దక్కవచ్చును. విద్యుత్ ఉత్పత్తి పెరిగితే రాష్ట్రానికి మిగులు విద్యుత్ కూడా ఏర్పడుతుంది. కనుక దాని ద్వారా కూడా రాష్ట్రానికి అదనపు ఆదాయం లభిస్తుంది. ఇక బొగ్గు లభ్యత పెరుగుతున్న కొద్దీ విద్యుత్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. బహుశః అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ధరలను తగ్గించేందుకు కృషి చేస్తానని ఇటీవల హామీ ఇచ్చారేమో?

 

ఈ బొగ్గు గనులలలో త్రవ్వకాలు మొదలయితే ఇక ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇతర రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేయగలిగే పరిస్థితి ఏర్పడుతుంది, కనుక ఆవిధంగా కూడా రాష్ట్ర ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అందుకే వీలయినంత త్వరగా ఈ బొగ్గు గనుల త్రవ్వకాలు మొదలు పెట్టాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కోరుతూ కేంద్రానికి లేఖ వ్రాసింది.

 

కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయినప్పటికీ, ఆ భగవంతుడే రాష్ట్రానికి ఈవిధంగా ఆదుకొన్నట్లుంది. ఈ నల్ల బంగారం రాష్ట్రానికి సిరులు కురిపించడం ఖాయం. కాకపోతే రాష్ట్రంలో కూడా మరో కోల్-గేట్ కుంభకోణం జరగకుండా ముందు నుండే జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.