TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కావూరి రీసౌండ్ వెనుకున్నదేవరు..?

Published on: Fri Sep 16, 2016 5:05PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిన వెంటనే..కాంగ్రెస్ పార్టీ ఏపీలో తుడిచిపెట్టుకుపోయింది. ఇక కాంగ్రెస్‌లో ఉంటే తమ గతి అధోగతి అని భావించిన ఏపీ కాంగ్రెస్ సీనియర్లు, జూనియర్లు అంతా మూకుమ్మడిగా తలో ఒక పార్టీలో చేరిపోయారు. చాలా మంది టీడీపీ అధికారంలోకి రాగానే దానిలోకి జంప్ అయ్యారు. తెలుగుదేశంలో బెర్త్ దొరకని వారు బీజేపీలో చేరిపోయారు. అలా చేరిన వారిలో పురందేశ్వరి, కావూరి ఉన్నారు. వీరు బీజేపీలోకి వెళ్లారు గానీ అక్కడ వీరిని పట్టించుకునే వారే లేరు. అయినా కమలంలోనే కొనసాగుతూ తమ వంతు వచ్చినపుడు మీడియాలో మాట్లాడుతూ కాలం గడిపేస్తున్నారు. పురేందేశ్వరి ప్రత్యేకహోదాపై ఆడపాదడపా మాట్లాడుతున్నారు, కానీ పాపం కావూరికి ఏ ఛాన్స్ రావడం లేదు.

 

పార్టీలో చేరి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా..తగిన ప్రాధాన్యం లేదని బాధపడుతున్న కావూరికి ఈ మధ్య బీజేపీ ఫుల్ ప్రయారిటీ ఇస్తోంది. ఆయన తరచూ మీడియా ముందుకు వస్తూ కాంగ్రెస్ పార్టీని ఏకీపారేస్తున్నారు. విభజన పాపం కాంగ్రెస్‌దే..జరగుతున్న అనర్థాలకు కారణం కాంగ్రెస్సేనని ఆయన విమర్శలు సంధిస్తున్నారు. బీజేపీలో చేరిన కొత్తల్లో టీడీపీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైనా తీవ్రస్థాయిలో మండిపడిన కావూరికి సడెన్‌గా కాంగ్రెస్ ఎందుకు గుర్తుకొచ్చింది.

 

విభజన పాపంలో కాంగ్రెస్‌కు ఎంత భాగం ఉందో..బీజేపీకి అంతే భాగముంది..ఇప్పటికే ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ వైఖరి ఏపీ ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి, విభజన పాపం కాంగ్రెస్‌దేనని జనంలోకి తీసుకెళ్లడం ద్వారా హోదా అంశాన్ని అటకెక్కించాలని కమలనాథులు డిసైడ్ అయ్యారు. అందుకే వేరే ఎవరితోనో కాంగ్రెస్‌పై విమర్శలు చేయిస్తే బాగుండదని విభజన సమయంలో కేంద్రమంత్రిగా వ్యవహరించిన కావూరిని అందుకు ఎంపిక చేసినట్లున్నారు. కావూరి కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా కాంగ్రెస్‌పై బాగానే విమర్శలు చేస్తున్నారు.