చంద్రబాబు వ్యూహంతో… జగన్ ఒత్తిడికి లోనవుతున్నాడా? 

ఒక్కసారి మనం 2014 కంటే వెనక్కి వెళితే… మళ్లీ తెలంగాణ ఉద్యమం కళ్ల ముందు కనిపిస్తుంది! అప్పటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు ప్రత్యేక తెలంగాణకు మద్దతిచ్చినవే. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీ, సీపీఐ… ఇలా ప్రతీ పార్టీ జైతెలంగాణ అనక తప్పలేదు. అయితే, మిగతా పార్టీలన్నీ ఆంద్రాలో నష్టం జరుగుతోన్న తెలంగాణకు సై అని ఎందుకు అన్నాయి? జనంలో వున్న సెంటిమెంట్ ని టీఆర్ఎస్ గుర్తించి క్యాష్ చేసుకుంది కాబట్టి! గులాబీ బాస్ కేసీఆర్ జనకాంక్షని గ్రహించి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి మిగతా అన్ని పార్టీల్ని కార్నర్ చేయగలిగారు! ఇప్పుడు అలాంటి వ్యూహమే చంద్రబాబు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు! అందులో జగన్ ఒత్తిడికి లోనుకావటం అసలు విశేషం!

 

 

ప్రత్యేక హోదా అంటూ గత కొంత కాలంగా టీడీపీ తన ఉద్యమాన్ని తార స్థాయికి చేర్చింది. ఏకంగా ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని రాష్ట్రంలో, దిల్లీలో పోరుబాట పట్టింది. ఎన్డీఏ నుంచి బయటకొచ్చి జనం ముందు బీజేపీని దోషిని చేసింది. ఇదంతా సక్సెస్ అవుతున్నట్టేనా? కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే సూచనలైతే కనిపించటం లేదు. కానీ, చంద్రబాబు పొలిటికల్ స్కోర్ అయితే పెంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా, ప్రతిపక్ష నాయకుడు జగన్ అంకంతకూ కార్నర్ అవుతున్నారు. టీడీపీ ఒకవైపు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని బీజేపీని, బీజేపితో సీక్రెట్ దోస్తీ చేస్తున్నారని జగన్ ని ఇరుకున పెడుతోంది. దాని ఫలితం పదే పదే కనిపిస్తోంది.

 

 

స్పెషల్ స్టేటస్ విషయంలో టీడీపీ జోరుని తగ్గించేందుకు జగన్ తన ఎంపీల చేత రాజీనామాలు చేయించారు. పార్లమెంట్లో నిరసనలు చేయించారు. కాకపోతే, ఏదీ కూడా మోదీకి మరి ఇబ్బందికరంగా మారకుండా జాగ్రత్తపడుతూనే వచ్చారు. ప్రసిడెంట్, వైస్ ప్రసిడెంట్ ఎన్నికలప్పుడు బేషరతుగా మద్దతిచ్చి మోదీ, షాల దృష్టిలో పడ్డారు. కానీ, ఈ మెతకదనం అసలుకే ఎసరు తెచ్చేలా వుందని భావించి ఇప్పుడు అలెర్ట్ అయ్యారు. మరోసారి మరో పరోక్ష ఎన్నికల్లో బీజేపికి మద్దతిస్తే టీడీపీ జనంలోకి ఆ విషయం తీసుకెళ్లి రచ్చ చేస్తుందని భయపడ్డ జగన్ కమలానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామంటూ సెలవిచ్చారు!

 

 

రాజ్యసభ డిప్యూటి చైర్మన్ పదవికి ఈ పార్లమెంట్ సెషన్లో ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ ప్రస్తుతం శత్రుపక్షం కాబట్టి ఎలాగూ మద్దతివ్వదు. కానీ, అనూహ్యంగా జగన్ కూడా తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించారు. బీజేపి అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయటం అంటే మోదీ, షాలకు కోపం తెప్పించటమే. అయినా జగన్ ఈ సాహసానికి పూనుకోవటం టీడీపీ వల్లే అనాలి.

 

 

ఇప్పటికే రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసంతో మోదీ సర్కార్ ను ఓ ఆటాడాలని టీడీపీ యోచిస్తోంది. ఎన్డీఏలో లేని ప్రతీ పార్టీని కలిసి మద్దతు అడుగుతోంది. శివసేన లాంటి పార్టీల్ని కూడా కదలించే ప్రయత్నం చేస్తోంది. ఇలా ప్రత్యేక హోదా ఇవ్వని మోదీపై చంద్రబాబు యుద్ధం చేస్తోంటే… జగన్ బీజేపికి మద్దతెలా ఇస్తారు? ఇస్తే జనంలోకి ఎలాంటి సంకేతాలు వెళతాయి? టీడీపీ నేతలు చూస్తూ ఊరుకుంటారా? ఈ ప్రశ్నల కారణంగానే జగన్ మోదీ వ్యతిరేక టీమ్ లోకి రావాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు ఒత్తిడి వ్యూహమనే చెప్పాలి! ఏపీలో బాబు బీజేపిని ఒంటరని చేశారనే అనాలి!