TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సజ్జనార్ కు ఏపీ డిప్యూటీ సీఎం అభినందనలు

Published on: Mon Nov 17, 2025 2:19PM

సినిమాల పైరసీతో తెలుగుచలనచిత్ర పరిశ్రమకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లేల చేసిన ఐబొమ్మ రవి అరెస్టు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హైదరాబాద్ సీపీ సజ్జనార్ ను, పోలీసులను అభినందించారు.  డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించిన సినిమాలను ఇలా విడుదల అవ్వగానే అనే  ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న ఐబొమ్మ రవి వంటి వారి వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్నదని పేర్కొన్న పవన్ కల్యాణ్..  

సినిమా విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శకనిర్మాతలకు సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఒక పోస్టు షేర్ చేసిన పవన్ కల్యాణ్..  పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్ సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి,  వాటిని మూయించివేయడం స్వాగతించదగ్గ పరిణామంగా అభివర్ణించారు.  పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి ఐబొమ్మ నిర్వాహకుడు వచ్చాడనీ, అటువంటి వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేయడం ముదావహమన్నారు.  బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ లాంటివాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వాటి వల్ల ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా చితికిపోతున్నారో చైతన్యపరుస్తున్న సజ్జనార్ ను ఆయనీ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

 సజ్జనార్ తో ఓ సందర్భంలో సమావేశమైనప్పుడు పొంజీ స్కీమ్స్ మూలంగా ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా మోసానికి గురై నష్టపోతున్నారో వివరించారని గుర్తు చేసుకున్నారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకు వచ్చిందన్నారు. ఆయన నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.