తెలంగాణకు విద్యుత్ ఇస్తా.. చంద్రబాబు

 

కరెంటు కష్టాల్లో కూరుకుపోయి వున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరినట్టయితే ఆ రాష్ట్రానికి 300 మెగావాట్ల కరెంట్ సరఫరా చేయడానికి సిద్ధంగా వున్నామని ప్రకటించారు. అయితే తెలంగాణలో కరెంట్ కష్టాలకు తానే కారణమని టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు సమస్య వుంటుందని తెలిసి కూడా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోకుండా తనపై విమర్శలు చేయడం న్యాయం కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల సౌకర్యం కోసం 300 మెగావాట్ల విద్యుత్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా వుందని ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి వల్ల శ్రీశైలం డ్యామ్‌లో నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయని, విద్యుత్ ఉత్పత్తి ఇలాగే కొనసాగితే ఎండాకాలంలో తాగడానికి ఇరు రాష్ట్రాల ప్రజలకు నీళ్లు ఉండవని ఈ ఉద్దేశంతోనే తాను శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించానన్నారు. దీనికి ప్రతిఫలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 300 మెగావాట్ల కరెంట్‌ను తెలంగాణకు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.