డెత్ జర్నీలుగా మారుతోన్న జల జర్నీలు... గోదావరిలోనే ఎందుకిలా?

నీటిపై ప్రయాణమంటే చిన్న పిల్లవాడి మొదలు వృద్ధుల వరకు అందరిలోనూ ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆ ఆనంద క్షణాలను మనసులో మధురమైన గుర్తులుగా మార్చుకుందామని పర్యాటకులు ఆశిస్తారు. కానీ, అలలపై ఆహ్లాదంగా సాగిపోవాల్సిన బోటు ప్రయాణాలు విషాదాంతమవుతున్నాయి. యాత్రికుల రక్షణ గాల్లో దీపంలా మారుతున్నాయి. ముఖ్యంగా పాపికొండల్లో జల విహారం ప్రాణ సంకటంగా మారుతోంది. ప్రకృతి అందాలను తనివితీర తిలకిస్తూ ఉరకలెత్తే ఉత్సాహంతో గోదావరి అలల సయ్యాటతో మునిగి తేలాలన్న సరదాల మాటున విషాదం పొంచి ఉందనే భయంకర నిజాన్ని పర్యాటకులు ఊహించలేకపోతున్నారు. దాంతో జల అందాలను ఆస్వాదిస్తూ చేసిన ప్రయాణం క్షణాల్లోనే ఆవిరైపోతున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం దగ్గర జరిగిన బోటు ప్రమాదంలోనూ ఇదే జరిగింది. అప్పటివరకు గోదావరి అందాలను చూసి పర్యాటకులు పరవశించిపోయారు. పాపికొండలను చూస్తున్నామన్న ఆనందంలో కేరింతలు కొట్టారు. గోదావరి చుట్టూ అల్లుకున్న ప్రకృతి అందాలకు ఫిదా అయిపోయారు. లోకాన్ని మరిచి...పరిసరాలను మైమరిచి నదీ సోయగాలను చూస్తూ ఉత్సాహంగా ముందుకుసాగారు. సహచర టూరిస్టులు, బంధువులు, కుటుంబ సభ్యులతో జాలీగా  గడుపుతూ ఫొటోలకు పోజులిచ్చారు. మరోవైపు బోటులో సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించారు. అయితే, ఆ అందమైన ప్రకృతే వికృతంగా మారుతుందని ఊహించలేకపోయారు. గోదారమ్మ అమాంతం తమను మింగేస్తుందని అనుకోలేదు. అలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. దాంతో ఒక్కసారిగా పడవ పక్కకు ఒరిగి గోదావరిలో మునిగిపోతుంటే... పర్యాటకులు చేసిన హాహాకారాలు, ఆర్తనాదాలు... ఆ గోదారమ్మ వినిపించుకోలేదు. కుటుంబ సభ్యుల కళ్లెదుటే ఆత్మీయులు జలసమాధి అయిపోయారు. దాంతో విహరయాత్ర కాస్త విషాదయాత్రగా మారిపోయింది.

అయితే, బోటు పైఅంతస్తులో ఉన్నవారు మాత్రమే, ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. కింది అంతస్తులో అద్దాల మధ్య ఉన్నవారతా జలసమాధి అయ్యారని భావిస్తున్నారు. బోటు దాదాపు 300 అడుగుల లోతులోకి దిగిపోవడంతో... వాళ్లంతా బోటులోనే చిక్కుకుని మరణించారని అంచనా వేస్తున్నారు. బోటును బయటికి తీస్తేనే, మృతుల సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.