ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో రచ్చరచ్చ.... తెలంగాణ‌లో కూల్‌కూల్‌...

ఏపీ, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు... ఒకదానికొకటి పూర్తి భిన్నంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలు రచ్చరచ్చ చేస్తుంటే, తెలంగాణలో మాత్రం ఇరువర్గాలు సంయమనంతో ముందుకెళ్తున్న వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్‌ను వదిలి నవ్యాంధ్ర  రాజధాని అమరావతిలో కొత్త అసెంబ్లీ నిర్మించుకుని తొలి సమావేశాలు నిర్వహిస్తోన్న తెలుగుదేశం ప్రభుత్వం.... ప్రతీ చిన్న విషయానికీ పంతానికి పోతున్నట్లు కనిపిస్తోంది. ఒకపక్క తెలంగాణలో విపక్షాలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సభ నడుపుతుంటే, ఏపీలో మాత్రం ప్రతిపక్షానికి ధీటుగా అధికారపక్షం రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నా మైక్‌ కట్‌ చేస్తున్నారంటూ ఏపీ అసెంబ్లీలో వైసీపీ పదేపదే వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేస్తుంటే, తెలంగాణ అసెంబ్లీలో మాత్రం రివర్స్‌ సీన్‌ కనిపిస్తోంది.

 

ఏపీ అసెంబ్లీలో సభ లోపలా, బయటా అధికార, ప్రతిపక్షాలు బాహాబాహీకి దిగుతున్నాయి. సభలో కాలు దువ్వుతున్న ఇరువర్గాలు, మీడియా పాయింట్‌లోనూ రచ్చరచ్చ చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మంత్రులం, ప్రజాప్రతినిధులనే సంగతి సైతం మర్చిపోయి.... తోపులాటకు దిగుతున్నారు. అసలు వీళ్లు మంత్రులేనా? ఎమ్మెల్యేలేనా? అని అనేలా ప్రవర్తిస్తున్నారు. చిల్లర రౌడీలు సైతం సిగ్గుపడేలా తిట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు.

 

ఇక తెలంగాణ అసెంబ్లీలో దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్షాలు సైతం హుందాగా నడుచుకుంటున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలకు అధికార పక్షం ధీటుగా సమాధానం చెబుతుందే కానీ, వ్యక్తిగత దూషణలకు దిగిన సందర్భాలు మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రధాని మోడీని మంత్రి జగదీశ్‌రెడ్డి కించపర్చారంటూ వెల్‌లోకి దూసుకెళ్లిన బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి.... పోడియం దగ్గరకు వచ్చినందుకు పశ్చాతాపపడుతున్న ప్రకటించారు. 

 

వెల్‌లోకి వచ్చినందుకే కిషన్‌రెడ్డి పశ్చాత్చాపం వ్యక్తంచేయడంతో.... తాను మోడీనుద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. వెల్‌లోకి దూసుకొచ్చినందుకు కిషన్‌రెడ్డి పశ్చాత్తాపం వ్యక్తంచేయడాన్ని మంత్రి హరీష్‌రావు అభినందించారు. తెలంగాణ సభ గౌరవాన్ని, హుందాతనాన్ని మరింత పెంచారంటూ ప్రశంసించారు.

 

అయితే ఏపీ అసెంబ్లీలో ప్రతిరోజూ రచ్చరచ్చ జరుగుతోంది. ఇటు ప్రతిపక్షం, అటు అధికారపక్షం ఎవరూ వెనక్కితగ్గడం లేదు. సభలోనూ, బయటా మాటల యుద్ధానికి దిగుతున్నారు, వ్యక్తిగత దూషణలతో సభ గౌరవాన్ని తగ్గిస్తున్నారు. విపక్షాలకు ధీటుగా మంత్రులు సైతం మీడియా పాయింట్‌ దగ్గరకొచ్చి రభస సృష్టిస్తున్నారు. అయితే తమ ప్రవర్తనకు సిగ్గుపడుతున్నామని కానీ, క్షమాపణ చెబుతున్నామని గానీ ఇటు ప్రతిపక్షం చెప్పడం లేదు, అటు అధికార పక్షమూ తగ్గడం లేదు.

 

విచిత్రమేమిటంటే... ఏపీలో ఇంత రచ్చ జరుగుతున్నా.... స్పీకర్ సస్పెన్షన్ల దాకా పోవటం లేదు.. తెలంగాణలో మాత్రం గవర్నర్ ప్రసంగం రోజే రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలను సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. ఇలా రెండు అసెంబ్లీలు డిఫరెంట్ డైరెక్షన్‌లో నడుస్తున్నాయి.