జగన్ డేటా దొంగలను పట్టుకున్న చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘డేటా చోరీ’ కేసు మరి కొన్ని గంటలలో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నవిషయం మీకు తెలిసిందే. మరోవైపు.. మాటకు మాట...  కేసుకు కేసు... సిట్‌కు సిట్‌! ‘డేటా ఫైట్‌’లో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని ఏపీ సర్కారు తేల్చి చెప్పేసింది. తమ సమాచారాన్నే తస్కరించి, ఎదురు ఆరోపణలు చేస్తున్నారని... ఈ కుట్రను ఛేదించి, దోషులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అసలు విషయం ఏమిటంటే...  తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డేటా చోరీ కేసుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ డేటా దొంగలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని చంద్రబాబు అమరావతిలో పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో వివరించారు. టీడీపీ డేటా చోరీకి వైసీపీ వేసిన యాక్షన్ ప్లాన్ వెల్లడైందన్నారు. సాక్ష్యాలన్నీ తుడిచేశామని నేరగాళ్లు అనుకుంటున్నారని, దొంగతనం చేసే క్రమంలో ఎక్కడో చోట ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేస్తారని బాబు చెప్పారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉందని సీఎం చెప్పారు. శనివారం(మార్చి 9) మధ్యాహ్నం 1 గంటకు ఆ వివరాలు వెల్లడిస్తా అన్నారు. డేటా చోరీ చేశామని తమపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న వైసీపీ, టీఆర్ఎస్ పార్టీల తాట తీస్తానని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ తో పెట్టుకుంటే ఎవరూ బాగుపడరని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని.. ఈ రోజుతో 25 ఎంపీ స్థానాల పరిధిలో సమీక్ష పూర్తవుతుందన్నారు. అభ్యర్థులపై రానున్న రెండు రోజుల్లో విశ్లేషించి తర్వాత ప్రచారం, బహిరంగసభలు నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు.