ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య సరికొత్త లొల్లి

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పుడు బోలెడన్ని వివాదాలు తలెత్తి, పరిష్కార మార్గం కనిపించక రెండు రాష్ట్రాల వారికీ ఇబ్బందికరంగా మారాయి. నీటి వివాదాలు, విద్యుత్ వివాదాలు, ఫీ రీ ఎంబర్స్‌మెంట్ వివాదం, ట్రాన్స్‌పోర్ట్ వివాదం, ఎంసెట్ కౌన్సిలింగ్ వివాదం... ఇలా రాసుకుంటూ వెళ్తే పెద్ద చేంతాడంత లిస్టు తయారవుతుంది. ఆ చేంతాడు చివర్లో కొత్తగా చేరిన సమస్య అసెంబ్లీ సెంట్రల్ హాల్ రిపేరు సమస్య.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం అసెంబ్లీ సెంట్రల్ హాల్‌‌ను పదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ‌ హాల్‌గా ఉపయోగించుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్ కొత్త శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు సరైన సదుపాయాలు లేక ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరిగేనాటికి ఎలాంటి ఇబ్బందులూ కలగకూడదన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించిన సెంట్రల్ హాల్‌లో రిపేర్లు చేయిస్తున్నారు. లైట్లు మార్చడం, టాయిలెట్స్‌ని బాగుచేయడం, ఫ్యాన్లు, ఏసీలు బాగు చేయడం లాంటి పనులు చేయిస్తున్నాయి. అయితే ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి సోలిపేట రామలింగారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నాయకులు తెలంగాణ చారిత్రక కట్టడమైన అసెంబ్లీ రూపురేఖలు మార్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ జరుగుతున్న పనులను ఆపివేయించారు. నిజాం కట్టించిన అసెంబ్లీ హాలు తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమని, దాని రూపురేఖలు మార్చడానికి వీలు లేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

దానికి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి కాలువ శ్రీనివాసులు స్పందిస్తూ, అసెంబ్లీలో తమ రాష్ట్రం పది సంవత్సరాలపాటు సమావేశాలు నిర్వహించుకోవడానికి హక్కు వుందని, తాము కేవలం లైట్లు మార్చడం, ఫ్యాన్లు, ఏసీలు రిపేరు చేయడం లాంటి పనులు చేస్తున్నామే తప్ప, సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామే తప్ప అసెంబ్లీ రూపు రేఖల్ని ఎంతమాత్రం మార్చడం లేదని చెప్పారు. అయితే కాలువ శ్రీనివాసులు వాదనతో ఏకీభవించని సోలిపేట రామలింగారెడ్డి ఈ విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఆయన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కి ఫిర్యాదు చేస్తే, ఈయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌కి ఫిర్యాదు చేస్తారు.. అలా ఈ వివాదం ముదిరిపోతుంది. ఇరు రాష్ట్రాల మధ్య మరో తెగని సమస్యలా మారిపోతుంది. సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోగలిగిన అనేక అంశాలు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలుగా మారడం సాధారణమైపోయింది.