ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్యలా? ఆ ఆలోచనే వద్దు!

 

ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ రాజేసిన హోమగుండంలో మొట్ట మొదటగా ఆ పార్టీకి చెందిన కార్యకర్త మునికోటి సమిధగా మారాడు. మళ్ళీ ఈ మధ్యనే ప్రత్యేక హోదా కోసం కృష్ణా జిల్లాలో పామర్రుకు చెందిన చావల సుబ్బారావు అనే వ్యక్తి ఫ్యానుకి ఉరేసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసాడు. కానీ అదృష్టవశాత్తు సకాలంలో అతని బార్య చూసి తన భర్తను రక్షించుకొంది. మొన్న ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం తరువాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే సంగతి తేటతెల్లం అవడంతో నెల్లూరు జిల్లా వేదాయపాలెం వాస్తవ్యుడయిన రామిశెట్టి లక్ష్మయ్య అనే 53 ఏళ్ల వయసు గల వ్యక్తి గురువారం ఉదయం తన ఇంట్లో ఫ్యానుకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ప్రత్యేక హోదా రాదనే ఆవేదనతోనే తను ఆత్మహత్య చేసుకొంటున్నట్లు లేఖ వ్రాసిపెట్టి చనిపోయాడు.

 

ప్రత్యేక హోదా కోరుతూ ఈవిధంగా ఆత్మహత్యలు చేసుకోవడం చాలా విచారకరం. వారి కుటుంబాలకు తీరని ఆవేదన, ఊహించని ఆర్ధిక సామాజిక సమస్యలు చుట్టు ముట్టవచ్చును. ప్రత్యేక హోదా రాకపోవడం వలన రాష్ట్రం కోలుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చును. కానీ ప్రళయం సంభవించదు. ప్రత్యేక హోదా ఉన్నాలేకపోయినా, పరిస్థితులు ఎలాగున్నా రాష్ట్రం మళ్ళీ మెల్లగా నిలద్రొక్కుకోగలదు. కనుక ప్రత్యేక హోదా రాలేదనే బాధతో ఆత్మహత్యలు చేసుకోవడం వలన చివరికి వారి కుటుంబాలే వీధిన పడే ప్రమాదం ఉంది.

 

ఇదివరకు తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న తరుణంలో కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ర్టం ఏర్పాటు చేస్తానని ప్రకటించి మళ్ళీ ఒత్తిళ్లకు తలొగ్గి మాట మార్చడంతో సుమారు 1200 మంది యువకులు తీవ్ర ఆవేదన చెంది బలిదానాలు చేసుకొన్నారు. అయినా అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. తరువాత ఎప్పుడో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు చేసింది. కానీ ఆ యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణా రాష్ట్రాన్ని ఎన్నడూ తెలంగాణా కోసం మాట్లాడని వాళ్ళు పరిపాలిస్తున్నారిప్పుడు. ఈనాడు వాళ్ళు అనుభవిస్తున్న ఈ రాజభోగాలకి కారకులయిన ఆ అమరవీరుల కుటుంబాలలో కొద్ది మందికి మాత్రమే ప్రభుత్వం సహాయం చేసింది. మిగిలిన వాళ్ళు చేతికి అందివస్తాడనుకొన్న బిడ్డ కాటికి పోయినందుకు కుమిలిపోతూ ఆదుకొనే నాధుడు లేక దయనీయమయిన జీవితాలు గడుపుతున్నారు.

 

ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తోంది అంటే, ఆనాడు తెలంగాణా రాష్ట్రం కోసం తెలంగాణా యువకులు ఆత్మహత్యలు చేసుకొన్నట్లే, ఈనాడు ప్రత్యేక హోదా కోసం ఆంధ్రాలో కూడా కొందరు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. కానీ తెలంగాణా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోవడం అనేది సరిదిద్దుకోలేని పెద్ద పొరపాటని అర్ధం అవుతోంది. తెలంగాణా యువకుల బలిదానాల వలన రాజకీయనాయకులే లబ్ది పొందగా బలిదానాలు చేసుకొన్న యువకుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ సంగతి గ్రహిస్తే ఎవరూ ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోరు.