పార్లమెంటు ముట్టడి ఎందుకట?



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం తన నిస్సహాయతను ప్రదర్శించింది. ఏ విషయంలో అయితే బీజేపీ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం విషయంలో పట్టుబట్టిందో, ఇప్పుడు అదే బీజేపీ అదే విషయంలో వెనకడుగు వేసింది. ఇలా వెనకడుగు వేయడానికి అనేక కారణాలు వున్నాయి. రాజ్యాంగ పరమైన ఆ కారణాలన్నిటినీ అధిగమించే శక్తి లేకపోవడం వల్లే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతోంది. మరి భవిష్యత్తులో తనకు అవకాశం లభిస్తే తన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందేమో! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడి పెంచితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇస్తుందేమో. పార్లమెంటులో అన్ని పార్టీల సహకారం లభిస్తే ఏపీకి ప్రత్యేక హోదా దక్కే ఛాన్సుందేమో. ఇలాంటి ఎన్నో మార్గాలు, అవకాశాలు వుండగా పార్లమెంటును ముట్టడిచేసే కాలం చెల్లిన ఐడియాతో ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళని ఏమనాలి?

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ ఏపీకి చెందిన కొంతమంది ఢిల్లీ బయల్దేరి వెళ్ళారు. అక్కడ నలుగురైదుగురు గుమిగూడి పార్లమెంటును ముట్టడి చేయడానికి వెళ్తున్నాం అని ప్రకటించి బయల్దేరారు. పోలీసులు సహజంగానే వాళ్ళని అరెస్టు చేసి, ఆ తర్వాత విడిచిపెట్టారు. సాయంత్రానికి పార్లమెంటును ముట్టడిస్తాం అని వెళ్ళినవారు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. పడుతూ లేస్తూ ఢిల్లీ వెళ్ళి వీళ్ళు సాధించిందేమిటి? ఫలానావాళ్ళు ఢిల్లీకి వెళ్ళి పార్లమెంటును ముట్టడించారన్న వార్త మీడియాలో రావడం. ఇంతకంటే వీళ్ళు సాధించిందేమీ లేదు. ఆ.. మరోటి సాధించారు.. వాళ్ళ పేర్లు మీడియాలో కనిపించాయి, వినిపించాయి. ఈ ప్రయోజనం అయితే దక్కింది.  ప్రస్తుతం ఏపీ చాలా సమస్యలలో వుంది. ప్రత్యేక హోదా రాకపోవడం కూడా ఒక సమస్యే. ఆ సమస్యను పరిష్కరించుకునే మార్గం మాత్రం ఇదికాదు. నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. కేంద్రాన్ని ఒక పద్ధతి ప్రకారం ఒప్పించే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఢిల్లీ వెళ్ళి పార్లమెంటును ముట్టడి చేస్తాం అంటూ హడావిడి చేస్తే దేశ రాజధానిలో పోయేది ఏపీ ప్రజల పరువే.