TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీ ఆంద్ర తెలంగాణా టార్గెట్ 45/30 లక్షలు

Published on: Fri Jan 9, 2015 1:40PM

 

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల పర్యటనకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రెండు రాష్ట్రాలలో పార్టీ సభ్యత్వ లక్ష్యాలు స్థానిక నేతలకు అందనంత ఎత్తులో ఉంచారు. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణాలో ఆ పార్టీ కొంత బలంగానే ఉందని చెప్పుకోవచ్చును. కానీ అక్కడ ఆశించినంతగా సభ్యత్వ నమోదు జరుగలేదు. ఇంతవరకు 8 లక్షలు మంది మాత్రమే కొత్తగా ఆ పార్టీలో చేరినట్లు సమాచారం. కానీ అమిత్ షా అక్కడి నేతలకి ఏకంగా 30 లక్షల భారీ లక్ష్యం నిర్దేశించారు. మొబైల్ ఫోన్లు, ఆన్ లైన్ ద్వారానే సభ్యత్వ నమోదు కార్యక్రమం చేప్పట్టాలని ఆయన సూచించడం మరో అగ్నిపరీక్షగా మారే అవకాశం ఉంది.

 

ఇక ఈరోజు విజయవాడలో పార్టీ నేతలతో సమావేశమయిన ఆయన వారికి ఏకంగా 45లక్షల మంది కొత్త సభ్యులను చేర్చాలని నిర్దేశించారు. అయితే ఆయన రాష్ట్ర పర్యటన ఖరారు అయ్యే వరకు సభ్యత్వ నమోదు ప్రక్రియను పెద్దగా పట్టించుకోని ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నేతలకు ఆయన ఇంత భారీ లక్ష్యం నిర్దేశించడం వలన ఏమయినా ప్రయోజనం ఉంటుందా? అని ఆలోచించక తప్పదు. ఇటువంటి కార్యక్రమాలని చాలా ప్రణాళికాబద్దంగా నిర్వహించే నేర్పు ఉన్న, బలమయిన క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంతో శ్రమించి రెండు రాష్ట్రాలలో కలిపి మొత్తం 50 లక్షల మందిని కొత్తగా పార్టీలో చేర్చుకోగలిగింది. కానీ బీజేపీ నేతలలో అటువంటి పట్టుదల, ప్రణాళిక, క్యాడర్ సపోర్ట్ లేకపోయినా రెండు రాష్ట్రాలలో కలిపి 75లక్షలు సాధించాలనుకోవడం విచిత్రమే. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపా అధికారంలో ఉంది కనుక ఆ పార్టీ దాదాపు 40 లక్షల మందిని పార్టీలోకి ఆకర్షించగలిగింది. కానీ రాష్ట్రంలో బలమయిన క్యాడర్ లేని బీజేపీ ఏవిధంగా 45 లక్షల లక్ష్యం చేరుకొంటుందో ఎవరికీ తెలియదు. “అంత భారీ లక్ష్యాలు పెట్టుకొంటే అందులో కనీసం పావు వంతు సాధించిన మంచిదే కదా!’ అనే ఆలోచనతో పెట్టుకొన్నారేమో!