TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టులో కదలిక

Published on: Thu Jan 8, 2015 8:22AM

 

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వైజాగ్, విజయవాడ మరియు తిరుపతి నగరాలలో నిర్మించబోయే మెట్రో రైల్ ప్రాజెక్టులకు ఆ రంగంలో విశేష అనుభవం, మంచి నైపుణ్యం ఉన్న ఈ శ్రీధరన్ సలహాదారుగా నియమించుకొన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన కొన్ని రోజుల క్రితం విజయవాడ, వైజాగ్ నగరాలలో విస్తృతంగా పర్యటించిన తరువాత, విజయవాడ నగరం మధ్యలో ఒక మెట్రో రైల్వే లైన్, వైజాగ్ నగరంలో అన్ని ప్రాధాన కూడళ్ళను కలిపే విధంగా మూడు మెట్రో రైల్వే లైన్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఆరు నెలలలో వైజాగ్ మరియు విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు అందజేసి, రెండు చోట్ల ఒకేసారి నిర్మాణం ప్రారంభించాలనుకొంటున్నట్లు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలిపారు. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును మూడేళ్ళలో పూర్తిచేసి ఇస్తానని హామీ కూడా ఇచ్చారు.

 

శ్రీధరన్ గుర్తించిన మూడు మెట్రో రైల్వే లైన్ మార్గాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు డిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కార్పోరేషన్ కి చెందిన నలుగురు నిపుణుల బృందం ఈరోజు వైజాగ్ రానుంది. వారు మెట్రో రైల్ ఏర్పాటుకు అవసరమయిన భూసేకరణ, ఏఏ ప్రాంతాలలో మెట్రో రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేయాలి? వంటి అన్ని అంశాలపై అధ్యయనం చేస్తారు. వైజాగ్ లో పారిశ్రామిక ప్రముఖ ప్రాంతమయిన గాజువాక నుండి యన్.ఏ.డి. జంక్షన్, రైల్వే స్టేషన్, హనుమంతవాక, మద్దిలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్, జగదాంబ జంక్షన్ మీదుగా నగరం కొస నుండే పాత పోష్టాఫీసు ప్రాంతం వరకు మూడు మెట్రో రైల్వే లైన్లను నిర్మించి వాటిని ప్రధాన కూడళ్ళలో అనుసంధానం చేయాలని శ్రీధరన్ ప్రతిపాదించారు.

 

ఈరోజు నగరానికి వస్తున్న నిపుణుల బృందం ఆ మార్గాలలో మెట్రో రైల్వే లైన్ నిర్మాణం కోసం అధ్యయనం చేయనున్నారు. అన్నీ సవ్యంగా సాగినట్లయితే బహుశః వచ్చే దసరా పండుగ సమయానికి రెండు చోట్ల నిర్మాణపనులు ప్రారంభం అవవచ్చును.