TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబు కంట కన్నీరు

Published on: Thu Mar 2, 2017 3:49PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముఖంపై చిరునవ్వు చిందిస్తుంటారు..ఎన్ని చీత్కారాలు, అవమానాలు ఎదురైనా..గుండెల నిండా బాధ ఉన్నా దానిని పైకి కనపడకుండా గుంభనంగా ఉంటారు. అలాంటి వ్యక్తి కళ్లవెంట ఇవాళ కన్నీరు వచ్చింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కొత్త అసెంబ్లీ భవనాలను సీఎం ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు.

 

తనకు హైకమాండ్ లేదని..తన హైకమాండ్ ప్రజలేనని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి కర్నూలులో గుడారాల్లో పాలన సాగించామని..సమైక్య రాష్ట్రంలో తెలంగాణతో 58 సంవత్సరాల ప్రయాణం తర్వాత కట్టుబట్టలు, అప్పులతో అమరావతికి చేరుకున్నామని అన్నారు. విభజన సమయంలో జరిగిన అన్యాయాన్ని, అవమానాలను గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి ఉద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టారు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దని అప్పటి ప్రభుత్వాన్ని ఎంత వేడుకున్నా వినలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని అభివృద్ధి చేసుకోవాలనే కసితో ప్రస్థానాన్ని ప్రారంభించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను తిరుగులేని రాష్ట్రంగా, నెంబర్‌వన్‌గా తయారుచేస్తానని సీఎం స్పష్టం చేశారు.