ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల చిత్రం

 

కాంగ్రెస్ అధిష్టానం పట్టుదల చూస్తే ఎన్నికలకు ముందే రాష్ట్ర విభజన జరగడం ఖాయంలా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చాలా రసవత్తరంగా ఉండబోతోంది. రాష్ట్ర విభజన చేసినందుకు ప్రజలు తమను దండించబోతున్నారని ఇప్పటికే గ్రహించిన కాంగ్రెస్ నేతలు వైకాపా, తెదేపాల వైపు చూస్తున్నారు. ఇక కిరణ్ కాంగ్రెస్ కూడా ఆవిర్భవిస్తే కొందరు అందులోకి దూకి తమను తాము కాపాడుకొనే ప్రయత్నం చేయవచ్చును. స్వశక్తి మీద గెలవగలమని బాగా నమ్మకం ఉన్న బొత్స, పురందేశ్వరి, పనబాక, సుబ్బిరామి రెడ్డి వంటి కొందరు నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీ టికెట్స్ పైనే పోటీ చేయవచ్చును.

 

అందువల్ల ఈసారి పోటీ తెదేపా మరియు వేర్వేరు జెండాలతో వస్తున్న ఈ మూడు కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుంది. కాంగ్రెస్ పన్నిన ఈ పద్మవ్యూహంలో గెలిచేందుకు తెదేపా తన సర్వ శక్తులూ ఒడ్డి పోరాడవలసి ఉంటుంది. అందుకు తెదేపా తన పటిష్టమయినపార్టీ శ్రేణులని, బలమయిన నాయకులని నూటికి నూరు శాతం వినియోగించుకోవలసి ఉంటుంది. అంటే పార్టీ అధిష్టానం మరియు పార్టీ శ్రేణుల మధ్య సరయిన అవగాహన చాలా అవసరమన్నమాట!

 

ఇక ఈ మూడు కాంగ్రెస్ పార్టీలు ఓట్లు చీల్చడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాయి గనుక, ప్రజలలో కాంగ్రెస్ పట్ల ఉన్నవ్యతిరేఖతనే కవచంగా చేసుకొని ఈ మూడు పార్టీలతో తెదేపా ఒంటరి పోరాటం చేయవలసి ఉంటుంది. ఈ ప్రయత్నంలో లెఫ్ట్ మరియు బీజేపీతో ఎన్నికల పొత్తులు కుదుర్చుకొనగలిగితే మరి కొంత బలం చేకూరుతుంది. సమర్ధపాలన అందించిన చంద్రబాబు, నరేంద్ర మోడీలు చేతులు కలిపితే వారి కాంబినేషన్ కి గలగలా ఓట్లు రాలవచ్చును.

 

ఇక జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎన్ని సర్వే రిపోర్టులు వచ్చినప్పటికీ, అతని సీబీఐ రికార్డులు, కాంగ్రెస్ పార్టీతో ఉన్నరహస్య సంబంధాలు, అతని అనుభవరాహిత్యం, దుందుడుకు శైలి, అతను చెప్పుకొనే విశ్వసనీయతే కరువవడం, పార్టీలో నేతలమధ్య అంతర్గత పోరు, పార్టీపై పూర్తి పట్టు లేకపోవడం వంటి అనేక లోపాలు ఆపార్టీకి శాపంగా మారవచ్చును. ముఖ్యంగా చంద్రబాబుతో పోలిస్తే జగన్ అనుభవ రాహిత్యం, ఎన్నికల తరువాత కాంగ్రెస్ తో చేతులు కలపాలనే అతని ఆలోచనలు ఆ పార్టీ ఓటమికి కారణం కావచ్చును. గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో అరాచక, అస్తవ్యస్త కాంగ్రెస్ పరిపాలనతో విసిగిపోయిన ప్రజలు మళ్ళీ ఎటువంటి పరిపాలనానుభవం లేని జగన్ కు అధికారం కట్టబెట్టే సాహసం చేయకపోవచ్చును. అందువల్ల తెదేపా నేర్పుగా ఈ మూడు కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కోగలిగితే విజయం సాధించవచ్చును.