ఏపీలో బీజేపీ బలపడేందుకు అవరోధాలు ఏమిటి?

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేతలు ఇవ్వాళ్ళ విజయవాడలో సమావేశమయ్యి మండల, జిల్లా స్థాయి పార్టీ అధ్యక్షుల నియామకాలపై చర్చించబోతున్నారు. ఈ సమావేశంలో వారు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిని సమీక్షించి, పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టవలసిన చర్యల గురించి చర్చించని సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడు కె. హరిబాబు పదవీ కాలం ముగుస్తుండటంతో ఆయన స్థానంలో మరొకరిని ఎంపిక చేసే విషయం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని ఆశిస్తోంది. అయితే దానికి రాష్ట్రంలో కొంత ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. అందుకు కారణాలు అందరికీ తెలిసినవే.

 

వాటిలో ప్రధానంగా ఆర్ధిక లోటును భర్తీ చేస్తూ నిధుల విడుదల, ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ-చెన్నై నగరాల మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వంటి వాటిపై మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం వలన ప్రజలలో చాలా అసంతృప్తి నెలకొని ఉంది. బిహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకి అడగకపోయినా భారీ ఆర్ధిక ప్యాకేజీలను ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడి, మిత్రపక్షంగా, భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ కేంద్రం పరిధిలో ఉన్న అంశాలు కనుక దానికి రాష్ట్ర బీజేపీ నేతలు సంతృప్తికరమయిన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆ కారణంగానే రాష్ట్రంలో బీజేపీని బలపరుచుకోవడం కష్టమవుతోందని భావించవచ్చును. బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియకు ప్రజల నుండి ఆశించినంతగా స్పందన రాకపోవడం గమనిస్తే అది అర్ధమవుతుంది.

 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడిలలో కనిపించే పోరాట స్ఫూర్తి, పార్టీని బలపరుచుకోవాలనే తపన, పట్టుదల రాష్ట్ర నేతలలో లోపించడం కూడా పార్టీ ఎదుగుదలకు ప్రధాన అవరోధంగా కనబడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపరుతున్నారు. రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకొని పార్టీ బలపరుచుకోవాలంటే, తాము భాగస్వామిగా ఉన్న తెదేపా ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఒక అపోహ వారిలో నెలకొని ఉన్నట్లు కనబడుతోంది. తద్వారా తెదేపాకు తామే ఏకైక ప్రత్యామ్నాయం అనే సంకేతం ప్రజలకు పంపించాలని వారు భావిస్తున్నారేమో? కానీ అటువంటి ప్రయత్నాల వలన రాష్ట్రంలో పార్టీ బలపడకపోగా ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపరుతున్నారు. పురందేశ్వరి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మి నారాయణ, కావూరి సాంభశివరావు వంటి నేతలు కొన్ని వ్యక్తిగత, రాజకీయ కారణాల చేత తెదేపాను విమర్శిస్తున్నారని అందరికీ తెలుసు.

 

కేంద్రం మంజూరు చేస్తున్న నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను, సంక్షేమ పధకాలను తమ స్వంతవిగా తెదేపా ప్రచారం చేసుకొంటున్నారని, అలాగే వాటిలో రాష్ట్ర బీజేపీ నేతలకు, మంత్రులకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారి ప్రధాన ఆరోపణ. అది చాలా సహేతుకమయినదే కనుక తెదేపా అధిష్టానం కూడా వారికి తగు ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉంది. తెదేపా-బీజేపీ నేతల మధ్య సమన్వయం సాధించి, వారి మధ్య సహృద్భావ వాతావరణం నెలకొల్పేందుకు వచ్చే నెల 5వ తేదీన రెండు పార్టీల నేతలు సమావేశం కానున్నారు. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పై తరచూ తీవ్ర విమర్శలు గుప్పించే బీజేపీ నేత సోము వీర్రాజు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. కనుక ఈ సమావేశంలో బీజేపీ నేతలు తమ అభ్యంతరాలని, ఆరోపణలని నేరుగా చంద్రబాబు నాయుడుతోనే మాట్లాడి అభిప్రాయభేదాలను పరిష్కరించుకోవడం మంచిది.

 

తెదేపాతో దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగత, రాజకీయ విభేదాల కారణంతో తాము భాగస్వామిగా ఉన్న తెదేపా ప్రభుత్వంపై కత్తులు దూస్తూ, బలపడే ప్రయత్నంలో నష్టపోవడం కంటే దానితో ఏర్పడిన భేదాభిప్రాయాలను తొలగించుకొని తమ సంబంధాలు బలపరుచుకోవడం ద్వారా రాష్ట్రంలో బీజేపీని బలపరుచుకోవడం అన్ని విధాల అందరికీ మంచిది. అలాగే రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి ఉన్న అవరోధాలను, తమ ప్రయత్నలోపాలను గుర్తించి వాటిని సరిచేసుకొని ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణాలో బీజేపీ చాలా బలంగా ఉందనే ఒక నిశ్చితాభిప్రాయం నెలకొని ఉంది. కానీ మొన్న జరిగిన వరంగల్ ఉప ఎన్నికలలో నిలబెట్టేందుకు పార్టీ తరపున బలమయిన అభ్యర్ధి లేకపోవడంతో బీజేపీ ఘోర పరాజయం పాలయింది. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని కూడా బీజేపీ నేతలు నిజాయితీగా సమీక్షించుకొని, తదనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవడం మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.