ప్రజా రాజధాని అమరావతిలో కార్పోరేట్ సంస్థలకే చోటు?

 

రాజధాని అమరావతిని జీవకళ ఉట్టిపడేలా ప్రజారాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతుంటారు. కానీ వాస్తవానికి అందులో ప్రజల భాగస్వామ్యం ఏమీ కనబడటం లేదు. కనీసం స్వదేశీ సంస్థలు, రైతులు, యువతకి కూడా చోటు ఉన్నట్లు కనబడటం లేదు. రాజధాని మాష్టర్ ప్లాన్ తయారీ నుండి రాజధాని నిర్మాణం వరకు అంతా సింగపూర్, జపాన్ తదితర దేశాలకు పూర్తి పెత్తనం అప్పగించబోతున్నట్లు స్పష్టం అవుతోంది.

 

రాజధానిలో శాసనసభ, సచివాలయం, హైకోర్టు, మంత్రులు, ముఖ్యమంత్రి నివాసాలు, మౌలిక సదుపాయాల కల్పనకు మాత్రమే కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేయబోతోంది కనుక రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి అంచనా వేసిన రూ.1.25 లక్షల కోట్లలో సింహ భాగం విదేశీ సంస్థల నుండే పొందవలసి ఉంటుంది. కనుక రాజధాని నిర్మాణంలో విదేశీ సంస్థల పెత్తనం అనివార్యంగా కనబడుతోంది. తనకున్న పలుకుబడిని చూసే విదేశీ సంస్థలు రాజధాని నిర్మాణానికి ముందుకు వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొంటున్నప్పటికీ లాభాపేక్ష లేనిదే ఏ విదేశీ వ్యాపార, పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు పెట్టవు కనుక అవి ఏదో ఓ రూపంలో తమ పెట్టుబడులకు పూర్తి ప్రతిఫలాలు తీసుకోవడం తధ్యం.

 

రాష్ట్ర విభజన కారణంగా రాజధాని కూడా లేకుండా పోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తుంటే అందరికీ సంతోషమే. కానీ దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే వేల కోట్ల రుణభారాన్ని రాష్ట్ర ప్రజలే మోయక తప్పదు. అదే విధంగా అత్యాధునిక రాజధాని నగరంలో కల్పించబడే సకల సౌకర్యాలకు అక్కడ నివసించే ప్రజలే మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ ఆ భారం మరీ అధికంగా ఉన్నట్లయితే దానిని కూడా రాష్ట్ర ప్రజలందరూ భరించవలసి వచ్చినా ఆశ్చర్యంలేదు. ఆ కారణంగా బహుశః అమరావతిలో నివసించాలంటే సామాన్య ప్రజలెవరికీ సాధ్యం కాకపోవచ్చును. రాష్ట్రంలో సామాన్య ప్రజలందరికీ అదొక పర్యాటక ప్రాంతంగానే తయారవుతుందేమో? రాజధాని నిర్మాణం తొలిదశ పూర్తయ్యే సమయానికి అక్కడి పరిస్థితులపై స్పష్టత రావచ్చును.

 

రాజధానిలో అనేక దేశ విదేశీ కార్పోరేట్ సంస్థలు రాబోతున్నాయి. కనుక అమరావతి ప్రజారాజధానిగా కాకుండా కార్పోరేట్ రాజధానిగానే అవతరించవచ్చును. రాజధాని నిర్మాణంలో రాష్ట్రంలో యువతకు, కార్మికులు, సాంకేతిక నిపుణులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించవచ్చును. కానీ రాజధాని కోసం భూములను ఇచ్చిన రైతుల పరిస్థితే అయోమయంగా మారుతుందేమో? ఎందుకంటే వారికి వ్యవసాయం తప్ప మరొక విద్య తెలియదు. కనుక అన్నదాతలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలు సిద్దం చేసిందో వేచి చూడాలి.

 

ఇక రాజధాని నిర్మాణం పూర్తిగా తెదేపా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంగానే సాగుతోంది తప్ప అందులో ప్రజల, ప్రతిపక్షాల అభిప్రాయాలకి, సూచనలకి ఎక్కడా అవకాశం ఉన్నట్లు కబడటం లేదు. రాజధాని ప్రాంతాన్ని ఎంపిక నుండి భూమి పూజ కార్యక్రమం వరకు ప్రజలకి, ప్రతిపక్షాలకి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. కానీ రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజలందరూ తమవంతు సహకారం అందించాలని కోరుతోంది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం విరాళాలు కూడా సేకరిస్తోంది. వచ్చేనెల 22న రాజధాని శంఖుస్థాపన కార్యక్రమాన్ని కోట్లు ఖర్చు చేసి చాలా అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని చెపుతూనే మళ్ళీ ఉన్న డబ్బుని ఆవిధంగా విచ్చలవిడిగా ఖర్చు చేయడాన్ని ఎవరూ హర్షించరు. రాజధాని నిర్మాణం కోసం విదేశీ సంస్థల నుండి అప్పులు తీసుకొంటున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరింత పొదుపుగా, ఆచితూచి డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. లేకుంటే ఆ భారాన్ని కూడా మళ్ళీ రాష్ట్ర ప్రజల నెత్తినే పడుతుంది. ఈ శంఖుస్థాపన కార్యక్రమానికి దేశ విదేశీ నేతలను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు చెప్పుతున్నారు. కానీ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు దానిలో పాల్గొనేందుకు ఆహ్వానం, అనుమతి ఉంటాయో లేదో చూడాలి.