తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న ఈ చిచ్చుని ఆర్పేదెవరు?

 

“రాష్ట్రాలుగా విడిపోదాము, అన్నదమ్ముల్లా కలుసుందాము...చైనా, పాకిస్తాన్ దేశాలతోనే ఎంతో సర్దుకుపోగా లేనిది ఇంతవరకు ఒక్కటిగా కలిసిమెలిసి జీవించిన తెలుగుజాతి రెండు రాష్ట్రాలుగా విడిపోతే సర్దుకుపోలేమా? హైదరాబాద్ లో నివసించే ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకొంటాము...” రాష్ట్ర విభజన జరగక ముందు ఇటువంటి గొప్ప గొప్ప మాటలు చాలా వినబడ్డాయి. కానీ రాష్ట్ర విభజన జరిగితే రెండు రాష్ట్రాల మధ్య ఎవరూ ఊహించలేనన్ని సమస్యలు, గొడవలు తలెత్తుతాయని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వాదించారు. చివరికి ఆయన మాటలే నిజమయ్యాయి. ఆయన కూడా ఊహించలేని అనర్ధాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి.

 

రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు సరికదా రోజుకొక కొత్త సమస్య పుట్టుకొస్తోంది. ఆ కారణంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్దాలు నిత్యకృత్యమయిపోయాయి. అవి కూడా ఇరు ప్రభుత్వాల పరిపాలనలో ఒక అంతర్భాగమా...అన్నట్లుగా మారిపోయాయి. రాష్ట్రం విడిపోతే ప్రళయం ముంచుకు రాదని తెలంగాణా నేతలు వాదించేవారు. కానీ ఇప్పుడు ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్: 8, తెలంగాణా ట్రాన్స్ కో నుండి ఒకేసారి 1200 మంది ఆంధ్రా ఉద్యోగులను బయటకి పంపడం, తాజాగా షెడ్యూల్:10 క్రింద ఉన్న సంస్థలపై ఆధిపత్యం కోసం ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు మరో యుద్దానికి సిద్దపడటం ఇలాగ ఒకదాని తరువాత మరొకటిగా వరుసగా జరుగుతున్న సంఘటనలన్నీ అటువంటి పరిస్థితికే దారి తీసేవిగానే కనబడుతున్నాయి.

 

ఈ సమస్యలన్నిటికీ కాంగ్రెస్ పార్టీనే నిందించక తప్పదు. తెలుగు ప్రజలు ఇంతకాలం కాంగ్రెస్ పార్టీని నెత్తినపెట్టుకొని మోసినందుకు వారికి మేలు చేయకపోగా, తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను చూసుకొని హడావుడిగా రాష్ట్ర విభజన చేసి తెలుగుజాతిలో ఈ చిచ్చు పెట్టింది. కనుక ఇరు రాష్ట్ర ప్రజలు కూడా ఇందుకు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ శపిస్తూనే ఉంటారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకొన్నట్లయితే కాంగ్రెస్ చేసిన తప్పిదాలను సరిదిద్దుకోవచ్చును. కానీ తెదేపా, తెరాసల మధ్య రాజకీయ వైరం కారణంగా సమస్యలు నానాటికీ పెరిగాయే తప్ప తగ్గుముఖం పట్టలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు సిద్దపడినప్పటికీ, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు సానుకూలంగా స్పందించడం చాలా విచారకరం. పైగా ఆయన ప్రదర్శిస్తున్నఅనవసమయిన దూకుడు కారణంగా సమస్యలు పరిష్కారం కాకపోగా నిత్యం కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

ఇంత జరుగుతున్న ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న గొడవలలో కేంద్ర ప్రభుత్వం తలదూర్చదని చెప్పడం సమంజసం కాదు. కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాన్ని విడదీసింది కనుక ఈ సమస్యల పరిష్కారానికి అదే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు తాత్కాలిక ఆలోచనలు చేయడం కంటే శాశ్విత ప్రాతిపదికన ఒక చట్టబద్దమయిన ప్రత్యేక యంత్రాంగం లేదా వ్యవస్థను ఏర్పాటు చేయడం మంచిది. లేకుంటే ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఈ అంతర్యుద్ధం కారణంగా రెండు రాష్ట్రాలలో సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది.