ఏపీ రాజధాని... ప్రస్తుతానికి 500 ఎకరాల్లోనే?

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని నగరం నిర్మించాలని ఉవ్విళ్ళూరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆశలపై కేంద్రం నీళ్ళు కుమ్మరించింది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయిస్తుందని భావిస్తే నయాపైసా కూడా కేటాయించలేదు. మున్ముందు ఏమయినా కేటాయిస్తుందో లేదో కూడా తెలియదు గానీ షరా మామూలుగానే హామీలు మాత్రం ఇస్తోంది. ఈ పరిస్థితిలో కేంద్రాన్ని నమ్ముకొని ముందు అనుకొన్నట్లుగా భారీ ప్రణాళికతో రాజధాని పనులు మొదలుపెట్టేసి మధ్యలో నిధులు లేక నిర్మాణం నిలిపివేసుకొని అప్రదిష్టపాలవడం కంటే, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అందుకు అవసరమయిన సొమ్ము సమకూర్చుకొని, దానితోనే ముందుగా 500 ఎకరాలలో రాజధాని ప్రధాన నగరం నిర్మించడం మేలనే ఆలోచనలోపడినట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం మున్ముందు నిధులు ఏమయినా విడుదల చేసినట్లయితే రాజధాని చుట్టూ మరో 2,000 ఎకరాలలో మరి కొన్ని ప్రధాన కట్టడాలు నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

రాజధాని నగర మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ కాపీ ఈ వారంలో ప్రభుత్వం చేతికి అందే అవకాశం ఉంది. దాని ఆధారంగా రాజధాని నగరం నిర్మాణానికి నిధులు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు హామీ ఇస్తున్నారు. ఒకవేళ ఆయన తన హామీని నిలబెట్టుకొని నిధులు విడుదల చేసినట్లయితే మంచిదే. లేకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక కేంద్ర సహాయం కోసం ఎదురుచూపులు చూడకుండా తన శక్తి, పరిధి మేరకు రాజధాని నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు సంబంధిత అధికారులు చెపుతున్నారు.

 

ముందుగా సచివాలయం, శాసనసభ, రాజ్ భవన్, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ మరియు నివాసం, వివిధ ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు, మంత్రులు, అధికారులు, ఉద్యోగుల కార్యాలయాలు మరియు వారి కోసం గృహ సముదాయాలతో కూడిన ప్రధాన రాజధాని నగరం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దానికయినా కనీసం 20-30వేల కోట్లు అవసరం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధమిక అంచనా వేసి, కేంద్రానికి నివేదిక పంపింది. కానీ కేంద్రం దానిని పట్టించుకోలేదు. కనుక ఒకవేళ కేంద్రం నిధులు విడుదల చేయకపోయినట్లయితే ఇక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమే ఈనెలలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లోనే అందుకు తగినన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది.

 

తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మోయలేని భారమే అయినప్పటికీ, ఇంకా కేంద్రసహాయం కోసం చకోరపక్షిలా డిల్లీ వైపు చూస్తూ కూర్చొనేకంటే తన స్వశక్తితోనే రాజధాని నిర్మాణం మొదలుపెట్టడమే మేలని భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం బడ్జెట్ లో కేవలం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించడం చూసి ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించుకొంటుందని ఇంతకు ముందు ప్రకటించారు. అయితే రాజధాని నిర్మాణం, పోలవరం రెండూ నిర్మించడం రాష్ట్ర ప్రభుత్వానికి శక్తికి మించిన పని అవుతుంది కనుక ముందుగా రాజధాని నిర్మాణ భారాన్నే భుజానికెత్తుకోవచ్చును. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడింది గనుక కేంద్రమే దానిని పూర్తిచేయవలసి ఉంటుంది. కనుక దానిని పక్కనబెట్టి, 2018లోగా రాజధాని ప్రధాన నగర నిర్మాణం పూర్తిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రణాళికలు సిద్దం చేసుకోవచ్చును.

 

త్వరలోనే చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి నిధులు విడుదల చేయమని కోరబోతున్నారు. ఆయన ప్రతిస్పందన చూసిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం విషయంపై ఒక నిర్దిష్ట అవగాహన ఏర్పడుతుంది కనుక తదనుగుణంగా ప్రణాళిక సిద్దం చేసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. మిగిలిన ఈ నాలుగేళ్ల కాలంలో ఎట్టి పరిస్థితులలో రాజధాని నిర్మాణం పూర్తిచేయవలసి ఉంటుంది కనుక కేంద్రం నిధులు విడుదల చేసినా చేయకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏమాత్రం ఆలశ్యం చేయకుండా రాజధాని నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టవచ్చును. రెండు మూడేళ్ళలో రాజధాని ప్రధాన నగరానికి రూపురేఖలు ఇవ్వగలిగితే, దాని ఆధారంగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది గనుక కేంద్రం సహాయం చేసినా చేయకపోయినా మిగిలిన నిర్మాణ కార్యక్రమాలకి నిధుల కొరత ఉండకపోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

 

అయితే నేటికీ కూడా రాజధాని నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం తప్పకుండా నిధులు విడుదల చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆశాభావంతో ఉంది. అవి కూడా అందినట్లయితే రాజధాని నిర్మాణం వేగంగా పూర్తవుతుంది. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం తన తిప్పలు తను పడక తప్పదు.