ఆంద్ర, తెలంగాణాల మధ్య మరో వివాదం

 

ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య కీచులాటలకు అంతే లేకుండా పోతోంది. తెలంగాణా ప్రభుత్వ అభ్యర్ధన మేరకు ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికి చెందిన రూ.120 కోట్ల నిధులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్తంభింపజేసింది. హైదరాబాద్ లోని వివిధ శాఖలలో రూ.50 కోట్లు ఫిక్సడ్ డిపాజిట్ల రూపంలో, ఉద్యోగుల సంక్షేమ నిధి, మెడికల్, లోన్స్, పెన్షన్స్ కోసం మరో 60 కోట్లు నిలువచేయబడి ఉంది. మిగిలిన 10 కోట్లు రోజువారి ఖర్చుల కోసం వేర్వేరు శాఖలలో నిలువ చేయబడింది. ఈ నిధులన్నిటినీ బ్యాంక్ స్తంభింపజేసిన తరువాత అదే విషయం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేసింది.

 

ఈ విషయం తెలుసుకొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తమకు తెలియజేయకుండా ఖాతాలను స్తంబింపజేసినందుకు బ్యాంకుపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. సోమవారం నాడు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయం గురించి చర్చించి తగిన నిర్ణయం తీసుకొంటామని తెలిపారు.

 

రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం రెండు రాష్ట్రాలలో ఉన్నత విద్యా విధానాలు, ప్రవేశ పరీక్షలు, నియమాకాలు వంటివన్నీ మరో 10 ఏళ్ల వరకు యధాతధంగా జరగవలసి ఉంది. కానీ తెలంగాణా ప్రభుత్వం తమ రాష్ట్రానికి వేరేగా తెలంగాణా ఉన్నత విద్యామండలిని ఏర్పాటు చేసుకొంది. కనుక ఆంద్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతాలలో రెండు రాష్ట్రాలకు ఉమ్మడి నిధిగా ఉన్న ఆ సొమ్మును స్తంభింపజేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్స్ 8,9,10 క్రింద వచ్చే అన్ని విద్యాసంస్థల తాలూకు ఉమ్మడి నిధులను స్తంభింపజేయమని తెలంగాణా ప్రభుత్వం గత ఏడాది అక్టోబరులోనే బ్యాంకులను కోరింది. కానీ ఆ విజ్ఞప్తిని బ్యాంకులు పట్టించుకోకపోవడం ఇటువంటి సంక్షోభం తప్పిపోయింది. కానీ తెలంగాణా రాష్ట్రానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్యాంక్ ‘నోడల్ బ్యాంకు’గా ఉన్నందున తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బ్యాంకు పాటించవలసి ఉండవచ్చును.

 

దీని గురించి తెలంగాణా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన కడియం శ్రీహరితో తను స్వయంగా మాట్లాడుతానని గంటా శ్రీనివాసరావు చెప్పారు. అయితే అందుకు తెలంగాణా ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇదివరకు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల కార్మిక శాఖకు చెందిన రూ.609 కోట్ల నిధులను తెలంగాణా ప్రభుత్వానికి తెలియజేయకుండా మురళీ సాగర్ అనే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాధికారి విజయవాడలో ఒక బ్యాంకుకు తరలించిన విషయాన్ని గుర్తు చేసి ప్రతివాదనలు చేయవచ్చును. కనుక ఈ విషయంపై మరో పెద్ద వివాదంగా మారినా ఆశ్చర్యం లేదు.