పరిశ్రమలు రావాలంటే రవాణా వ్యవస్థ మెరుగు పడాలి

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు, రైల్ మరియు జల రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మరియు పోర్టుల అభివృద్ధిపై దృష్టి పెడుతుంటే, కేంద్రం అంతర్గత జలరవాణ మరియు రైల్ రవాణా వ్యవస్థల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలు, పెట్టుబడులు అవసరమయితే వాటి అభివృద్ధికి చక్కటి రవాణా వ్యవస్థలు కూడా అంతే అవసరం. మంచి రవాణా వ్యవస్థ ఉన్నచోటికే పరిశ్రమలు కూడా తరలివచ్చేందుకు ఆసక్తి చూపుతాయి.

 

అయితే ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు కూడా పరిశ్రమల కోసం ప్రత్యేక పాలసీలు ప్రకటించాయే తప్ప రవాణా వ్యవస్థ కోసం నిర్దిష్టమయిన పాలసీలు ఏవీ ఏర్పాటు చేసుకోలేదు. ఆ కారణంగానే నేటికీ దేశంలో ఎక్కడా సరయిన రవాణా వ్యవస్థ లేకుండా పోయింది. భారతదేశంలో కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు నిత్యం లక్షలాది లారీలు, ట్రక్కులు, కంటెయినర్లలో భారీగా సరుకు రవాణా జరుగుతోంటుంది. కానీ దేశంలో ఎక్కడా సరయిన రోడ్లు ఉండవు. ఇన్ని దశాభ్దాలుగా ఆ గతుకుల రోడ్లపైనే వాహనాలనీ ప్రయాణిస్తూ సరుకు రవాణా చేస్తున్నాయి.

 

ఇక రోడ్డు రవాణా తరువాత దేశంలో విరివిగా వాడకంలో ఉన్నది రైల్ రవాణా వ్యవస్థ. దాని ద్వారా సరుకు రవాణా చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు అశ్రద్ధ కారణంగా నేటికీ అది కొన్ని పరిమితులకు లోబడే రవాణా చేస్తోంది. దేశంలో ఒక చోట నుండి మరొకచోటికి అత్యంత తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో అతి సురక్షితంగా సరుకు రవాణా చేయగల ఈ వ్యవస్థని మరింత అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది.

 

భారతీయ రైల్వేలో ప్రత్యేకంగా కార్గో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. కానీ కొత్తగా రైల్వే ట్రాకులు వేయనంత వరకు మిగిలిన వ్యవస్థలను ఎంత కట్టుదిట్టం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండబోదు. కనుకనే రైల్వేలలో కూడా విదేశీపెట్టుబడులను కేంద్రప్రభుత్వం అనుమతిస్తోంది. దాదాపు 125కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో రైల్ (సరుకు) రవాణా కోసం ప్రత్యేకంగా రైల్వే ట్రాకులు ఏర్పాటు చేసేందుకు దేశ, విదేశీ సంస్థలు ముందుకు వచ్చినట్లయితే అందుకు తగిన ప్రతిపలం వారు తప్పకుండా పొందే అవకాశం ఉంటుంది.

 

ఇక దేశంలో అంతర్గత జల రవాణా వ్యవస్థ నామ మాత్రంగా కనబడుతుంది. ఏవో కొన్ని రాష్ట్రాలు, జిల్లాలో మాత్రమే కనబడుతుంది. ఈ మూడు రవాణా వ్యవస్థలకు కలిపి లేదా విడివిడిగా ప్రత్యేకమయిన పాలసీలు, వాటి అభివృద్ధికి కృషి చేసే ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసుకొన్నట్లయితే వాటి పరిస్థితి మెరుగుపడుతుంది.

 

ఆంద్రప్రదేశ్ విషయం తీసుకొన్నట్లయితే రోడ్డు రవాణా వ్యవస్థ కొంచెం మెరుగుగానే కనిపిస్తున్నపటికీ, వాటిని మరింత మెరుగుపరిచి వాటిని సమీప పోర్టులతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సరుకు రవాణా కోసమే ప్రత్యేకంగా రోడ్లు నిర్మించే ఆలోచనలు కూడా చేస్తోంది. కానీ అది చాలా భారీ వ్యయంతో కూడుకొన్నది. కానీ రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న జనాభా మరియు వాహనాల కారణంగా రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కనుక అంచెలంచెలుగా అయినా సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా రోడ్లు నిర్మించగలిగితే అది తప్పకుండా చాలా మంచి ఫలితాలే ఇస్తుంది. సరుకు రవాణా వాహనాలకు అవసరమయిన అన్ని రకాల అనుమతులు అవి బయలుదేరిన చోటే ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినట్లయితే దానివలన తమకు చాలా సమయం కలిసి వస్తుందని ఒక ప్రముఖ రవాణా వ్యవస్థ యజమాని సత్య బోలిశెట్టి అన్నారు. ఈ రంగాన్ని కూడా శాస్త్రీయంగా అధ్యయనం చేసి అభివృద్ధి చేసినట్లయితే దీనిలో కూడా యువతకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అయితే అన్నిటికంటే ముందు వీటి కోసం ప్రత్యేకంగా యంత్రాంగం ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది.

 

కేంద్రప్రభుత్వం కాకినాడ నుండి చెన్నై వరకు ఇదివరకున్న అంతర్గత జలరవాణ వ్యవస్థను మళ్ళీ ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు, కొందరు ఉన్నతాధికారులను నియమించింది. విజయవాడలో ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసింది. వారు ప్రస్తుతం మిగిలి ఉన్న జల రవాణా వ్యవస్థను అధ్యయనం చేస్తున్నారు. అది పూర్తయితే వారి సూచనలు, ప్రతిపాదనల మేరకు ఆ వ్యవస్థను చక్కదిద్దే పనులు మొదలవుతాయి.

 

ఇక రాష్ట్రంలో కొత్తగా మరో పది పోర్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అవి ఏర్పాటు చేయగలిగినట్లయితే, దేశ విదేశాలకు భారీగా సరుకు ఎగుమతులు, దిగుమతులు చేసుకొనే అవకాశం కలుగుతుంది. కానీ ఇది కూడా చాలా ఖర్చుతో కూడుకొన్న వ్యవహారమే కనుక వీటి అభివృద్ధికి కేంద్ర సహకారం చాలా అవసరం.